ఐస్లాండ్లో వరుస భూకంపాలు.. పొంచి ఉన్న భారీ ప్రమాదం..

By :  Kiran
Update: 2023-11-11 09:53 GMT

ఐరోపా ద్వీప దేశం ఐస్‌లాండ్‌ వరుస భూకంపాలతో వణికిపోతోంది. రెక్జానెస్‌ ప్రాంతంలో 14 గంటల వ్యవధిలో దాదాపు 800 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ఐస్‌లాండ్‌ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఐస్‌లాండ్‌ రాజధాని రెక్జావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు బలమైన భూకంపాలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌పై వాటి తీవ్రత 5.2 గా నమోదైంది. ప్రకంపనల ధాటికి సమీప ప్రాంతాల్లోని రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రెక్జానెస్‌ ప్రాంతంలో అక్టోబర్ చివరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 24వేల సార్లు భూమి కంపించింది.

భూ ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం వారి రక్షణ కోసం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ ప్రకంపనల తీవ్రత మరింత పెరగవచ్చని, ఫలితంగా అగ్నిపర్వత విస్ఫోటాలకు దారితీయొచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే రానున్న రోజుల్లో విస్ఫోటం సంభవించే అవకాశం ఉందని ఐస్‌లాండ్ వాతావారణ విభాగం అంచనా వేసింది.

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గల ద్వీప దేశమైన ఐస్‌లాండ్‌లో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు జరుగుతుంటాయి. ఒక్క ఐస్‌లాండ్‌లో 33 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అవి ఏ క్షణమైనా బద్దలయ్యే ప్రమాదం ఉంది. దీంతో అగ్ని పర్వతాలకు దగ్గరలో ఉన్న జనావాసాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


Tags:    

Similar News