దేశం అల్లకల్లోలం.. ఆడవాళ్లందరూ సమ్మెలో..

Update: 2023-10-25 06:31 GMT

దేశంలోని ఉద్యోగినులందూ సమ్మె చేస్తే ఎలా ఉంటుంది? డాక్టర్లు, నర్సులు, ఇంజినీర్లు, టీచర్లు, క్లర్కులు, క్లీనర్లు మరెన్నో రకాల విధులు నిర్వహిస్తున్న మహిళలు తమ హక్కుల కోసం గర్జిస్తూ పనిని పక్కన పడేస్తే ఏమవుతుంది? మొత్తం దేశమే అల్లకల్లోలంగా మారుతుంది. ఎదీ సరిగ్గా సాగదు. అన్ని సేవలూ నిలిచిపోతాయి. అన్నీ ఎక్కడికక్కడ బంద్. మగ లోకం గగ్గోలు పెడుతుంది. అంటార్కిటికాకు దగ్గర్లో ఉన్న ద్వీపదేశం ఐస్‌లాండ్‌లో అదే పరిస్థితి నెలకొంది. సమాన పని సమాన వేతనం, లింగవివక్ష, గృహహింస నిర్మూలన, తదితర డిమాండ్ల సాధన కోసం ఆ దేశ మహిళలు మంగళవారం దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. వేలమంది రోడ్లెక్కి నిరసన తెలిపారు. దేశ పప్రధానమంత్రి జాకబ్స్‌స్టాటిర్ కూడా సమ్మెలో పాల్గొనడం విశేషం. ‘‘ఈ రోజు ఇంట్లో ఉండే నిరసనలో పాల్గొంటాను, నా కేబినెట్లోని మహిళా మంత్రులందరూ సమ్మెలో పాల్గొంటారని ఆశిస్తాను’’ అని ఆమె ట్వీట్ చేసింది.

సమ్మెతో దేశంలో జనజీవనం అస్తవ్యవస్తమైంది. స్కూళ్లు, నర్సరీలు మూతపడ్డాయి. నర్సులు, లేడీ డాక్టర్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు తదితర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయింది. టీవీ, రేడియో స్టేషన్లలో కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. ఐస్‌లాండ్‌లో 1975 తర్వాత ఆడవాళ్లు ఇంత భారీ సమ్మె చేపట్టడం ఇదే తొలిసారి. 1975లో నాటి సమ్మెలో ఉద్యోగినుల్లో 90 శాతం మంది పాల్గొన్నారు. ప్రపంచంలో లింగ సమానత్వం సాధించిన దేశాల్లో ఐస్‌లాండ్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. అయినా జీతాలు, హక్కుల విషయంలో తమకు వందశాతం సమానత్వం కావాలని నారీ లోకం డిమాండ్ చేస్తోంది. 


Tags:    

Similar News