అమెరికా అధ్యక్ష ఎన్నికలు : రిపబ్లికన్‌లలో సెకండ్ ప్లేస్‌లో వివేక్ రామస్వామి

Update: 2023-08-21 06:26 GMT

వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల (US presidency) కోసం రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీపడే అభ్యర్థుల్లో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకుపోతున్నారు. ర్యాలీలు, ఫండ్ రైజింగ్, డిబేట్‌లను నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. తాజాగా, ఎమెర్సన్‌ కాలేజీ వద్ద నిర్వహించిన పోలింగ్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) 56 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులుగా నిలిచిన డేశాంటిస్‌ , రామస్వామిలు పది శాతం చొప్పున సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే, రామస్వామి మద్దతుదారుల్లో అత్యధికులు(దాదాపు సగం మంది) ఆయనకే ఓటు వేస్తామని గట్టిగా చెబుతుండగా, డేశాంటిస్‌ మద్దతుదారుల్లో మాత్రం తడబాటు కనిపిస్తోంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఓటర్లు, 35 ఏళ్ల లోపు వయసున్న వారి మద్దతు కూడగట్టడంలో వివేక్ రామస్వామి మంచి పురోగతి సాధిస్తున్నట్టు ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పెన్సర్ కింబల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ట్రంప్‌ మొదటి స్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా రెండో స్థానంలో దూసుకుపోతున్న రామస్వామికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌(Joe Biden)పై పోటీలో నిలిచే అవకాశం ఆయనకే ఉంటుందని భావిస్తున్నారు. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, హర్ష్ వర్ధన్ సింగ్‌లతో సహా వివేక్ రామస్వామి వచ్చే వారం మొదటి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లో పాల్గనడానికి స్పష్టమైన అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ డిబేట్‌కు హాజరుకాకూడదని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 80% కంటే ఎక్కువ మంది రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లు తాము చర్చను చూడాలనుకుంటున్నామని చెప్పారు. తన రాజకీయ ప్రచారం ‘న్యూ అమెరికన్ డ్రీమ్’‌పై రామస్వామి దృష్టి సారించారు. ఇదే సమయంలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సైతం రామస్వామికి మద్దతు ప్రకటించారు. ఆయనను చాలా సమర్ధవంతమైన అభ్యర్థిగా అభివర్ణించారు.

Tags:    

Similar News