కుగ్రామంగా మారిన నేటి ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతీయుల సంతతి నాయకుడు ఇప్పుడు బ్రిటన్ అధినేత. ఆఫ్రికా నల్లజాతివారిపై మాటల్లో చెప్పలేని నేరాలకు పాల్పడిన అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఆ నల్లజాతి మనిషే అధిష్టించాడు. జర్మనీ సంతతికి చెందిన డొనాల్డ్ ట్రంప్ కూడా అగ్రరాజ్య సారథి అయ్యాడు. వలసలు, రాజకీయాలు, ప్రతిభాపాటవాలు మరెన్నో కారణాల వల్ల ఊహకు అందని రీతితో కొందరు దేశాల నాయకత్వం అందుకుంటున్నారు. అమెరికాలో ఇప్పటికే పలువురు భారత సంతతి నేతలు కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టారు. రాష్ట్రాల గవర్నర్లుగా, మంత్రులుగా చక్రం తిప్పుతున్నారు. అదే ఊపులో వ్యాపారి వివేక్ రామస్వామి ఏకంగా అధ్యక్ష ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న 38 ఏళ్ల ఈ భారత సంతతి నేత అనుకున్నది సాధించగలడా? మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో సహా పలువురు ఉద్ధండులను ఎదుర్కొని పార్టీ టికెట్ సంపాదిస్తాడా? టికెట్ దక్కినా బలంగా ఉన్న డెమోక్రాట్లపై విజయం సాధించి వైట్‌హౌస్ ఆఫీసులో భారతీయత ఉట్టిపడే పేరుతో ఉత్తర్వులపై సంతకం చెయ్యగలడా?
అంతర్గత పోరులో..
రిపబ్లికన్ పార్టీ టికెట్ కోసం హోరాహోరీగా సాగుతున్న పోరులో రామస్వామి ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. ట్రంప్ తొలి స్థానంలో, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటీస్ రెండో స్థానంలో ఉన్నారు. టికెట్ ఖరారు చేయడానికి పార్టీ జరుపుతున్న చర్చలో రామస్వామి ‘నిజం’ పేరుతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎవరూ ప్రస్తావించని అంశాలను ముక్కుసూటిగా చెబుతున్నారు. గర్భస్రావాలకు తను వ్యతిరేకమని, మెక్సికో సరిహద్దులో అక్రమ వలసలను అరికట్టడానికి మిలిటరీని దించాల్సిందేనని అతివాద డిమాండ్లు చేస్తున్నాడు. ఇలాంటి విషయాల్లో ముందుండే ట్రంప్‌కు మించి దూకుడు ప్రదర్శిస్తున్నాడు. రామస్వామికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఎన్నికలకు మూడు నెలల మాత్రమే గడువు ఉంది. రిపబ్లికన్లు అంతకు చాలా ముందే తమ అభ్యర్థిని ఎంచుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్ ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్‌కే టికెట్ దక్కే అవకాశం ఉంది. అతడు 57 పాయింట్లతో కొనసాగుతున్నారు. డిసాంటీస్ 17 పాయింట్ల దగ్గర, వివేక్ రామస్వామి 9 పాయింట్ల వద్ద ఉన్నారు. మరిన్ని రాష్ట్రాల్లో డిబేట్లు జరగాల్సి ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగినా రామస్వామి ట్రంప్‌ను అధిగమించడం అసాధ్యమే. ఏదో అద్భుతం జరిగితే తప్పే అతనికి టికెట్ రాదు. రిప్లబికన్ల బరిలో మరో ఇద్దరు భారత సంతతి నేతలు నిక్కీ హేలీ, హర్షవర్ధన్ సింగ్‌ల ఆశలు కూడా గల్లంతు కానున్నాయి.
అధ్యక్ష బరిలో..
గుర్రం ఎగరావచ్చు అన్నట్టు వివేక్ రామస్వామి ఎలాగోలా రిపబ్లికన్ల అభ్యర్థిత్వం సాధించినా ప్రధాని బరిలో గెలువగెలడా అన్నది సందేహమే. డెమోక్రాట్ల నుంచి అధికారాన్ని అందుకోవడం అంత సులభం కాదు. ట్రంప్ ప్రభుత్వంతో విసిగి వేసారిన అమెరికన్లు రిపబ్లికన్లకు తిరిగి అధికారం కట్టబెట్టే పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ట్రంప్‌ల మధ్య పోటీ ఖరారనే లెక్కతోనే పోల్స్ నిర్వహిస్తున్నారు. సర్వేల సగటు చూస్తే అమెరికన్లు బైడెన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఏపీ ఎన్వోఆర్సీ నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు ఓటేవేసే ప్రసక్తే లేదని 53 శాతం చెప్పారు. స్థూలంగా చూస్తే అధ్యక్ష పీఠం రేసులో బైడెన్ 40 పాయింట్లు, ట్రంప్ 30 పాయంట్లు, రామస్వామి 9 పాయింట్లతో కొనసాగుతున్నట్లు విశ్లేషకుల అంచనా!