Israel Hamas War : 1500 మంది హమాస్ సైనికులు హతం

Byline :  Veerendra Prasad
Update: 2023-10-10 07:46 GMT

పాలస్తీనా హమాస్ దాడులతో ఇజ్రాయెల్ పరిస్థతి అస్తవ్యస్తంగా మారింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన అమాయక పౌరులు, సైనికులు మృత్యువాత పడుతున్నారు. శనివారం నుంచి మొదలైన ఈ ఎదురుకాల్పుల్లో 1600 మంది మరణించారని నివేదికలు చెబుతున్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Gaza Health Ministry) తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇక హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్‌లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఈ యుద్ధాన్ని మేం కోరుకోలేదు. అత్యంత క్రూరంగా మాపై బలవంతంగా రుద్దారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్‌లో ప్రారంభించకపోయినా.. మా దేశం దానిని అంతం చేస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. సోమవారం అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్‌ దేశం.. సుమారు 300,000 మంది సైనికులను సిద్ధం చేసింది. దీంతో హమస్‌ దాడికి ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్‌ భారీ వైమానిక దాడులను ప్రారంభించింది. సోమవారం అర్ధరాత్రి భారీ ఎత్తున యుద్ధ విమానాలతో దాడులు చేసింది. దీంతో హమాస్‌ తీవ్రవాద సంస్థకు చెందిన దాదాపు 1500 మంది తీవ్రవాద మిలిటెంట్ల మృతదేహాలు లభ్యమైనట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రకటించింది.

నెతన్యాహు మంగళవారం చేసిన ట్వీట్ లో హమాస్ ను తీవ్రవాద ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థను ఐసిస్ తో పోల్చారు. ‘‘హమాస్ అంటే ఐసిస్. ఐసిస్ ను ఓడించడానికి నాగరికత శక్తులు ఏకమైనట్లే, హమాస్ ను ఓడించడంలో నాగరికత శక్తులు ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్ పై సంపూర్ణ దిగ్బంధం విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ సోమవారం ప్రకటించింది. ఈ ప్రాంతానికి ఆహారం, ఇంధనాన్ని అనుమతించడంపై నిషేధం విధించింది




Tags:    

Similar News