ఇజ్రాయెల్ – పాలస్తీనా ఘర్షణలు విలువైన ప్రాణాలతో పాటు వంశాలకు వంశాలనే నిర్మూలిస్తున్నాయి. రెండు వైపులా భారీ ప్రాణనష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు కాస్త ఊరట కల్పించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘వీర్య సేకరణ’ నిబంధనలను సడలించింది. ఘర్షణల్లో చనిపోయిన ఇజ్రాయెలీ సైనికులు, సాధారణ యువకుల వీర్యాన్ని సేకరించడానికి అనుమతిచచ్చింది. దీంతో మృతుల కుటుంబాలు వీర్యాన్ని సేకరించి భద్రపరచుకుంటున్నాయి. తాజా ఘర్షణలు మొదలైనప్పట్నుంచి ఇంతవరకు 33 మంది వీర్యాన్ని సేకరించినట్లు స్పెర్మ్ బ్యాంకులు చెప్పాయి. మృతుల భార్యలు, ప్రియురాళ్లు భవిష్యత్తులో గర్భం దాల్చడానికి వీలుగా వీర్యాన్ని సేకరిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఓ వ్యక్తికి పెళ్లయినా, పెళ్లి కాకపోయినా వీర్యదానం చేయొచ్చు. పెళ్లి కాని వ్యక్తి వీర్యాన్ని సేకరించాలంటే ఫ్యామిలీ కోర్టు అనుమతి తీసుకోవాలి. వివాహితుడి వీర్యాన్ని సేకరించాలంటే అతని భార్య అనుమతించాలి. యుద్ధంలో ఈ నిబంధనలు పాటించడం కష్టంగా మారడంతో నిబంధనలు తొలగించారు. వీర్య సేకరణ కోసం రక్షణ శాఖ ఇచిలోవక్, సెబా, షామీర్, బీలిన్సన్ ప్రాంతాల్లోని స్పెర్మ్ బ్యాంకుల్లో ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు దీనికి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తోంది.
గర్భధారణ కోసం మృతుల వీర్యాన్ని సేకరించే పద్ధతిని Posthumous Sperm Retrieval (పీసీఆర్) అంటారు. మనిషి చనిపోయిన తర్వాత 24 నుంచి 36 గంటల్లోపు వీర్యాన్ని సేకరించి భద్రపరాలి. తర్వాత ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణకు వాడతారు.