Gaza/Jerusalem : శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బాంబులు.. 50 మంది మృతి

Byline :  Veerendra Prasad
Update: 2023-11-01 07:56 GMT

ఇజ్రాయెల్(Israel), హమాస్(Hamas) మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ తొమ్మిదిన్నర వేల మందికి పైగా మరణించారు. తాజాగా ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Palestine Health Department) తెలిపింది. ఈ దాడిలో 50 మంది మరణించగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ వైమానిక దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ ఇబ్రహీం బియారీ మరణించారు. అక్టోబర్ 7న తమపై జరిగిన దాడుల్లో ఇబ్రహీం బియారీ కీలకపాత్ర పోషించారని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇక ఇదే సమయంలో హమాస్ ఉగ్రవాదులు గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ సైనికులను కూడా చంపారు. కిడ్నాప్‌లు, హత్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రజలు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో అప్పీల్ చేశారు.

ఇదిలావుంటే.. ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప‌లు దేశాలు ఖండించాయి. అమానవీయమైనదిగా ఈజిప్ట్(Egypt) అభివర్ణించింది. ఈ దాడి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఈజిప్ట్ పేర్కొంది. ఇజ్రాయెల్ ఆసుపత్రులు, శరణార్థుల శిబిరాలపై దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ దాడులను ఆపడానికి, గాజా నివాసితులకు మానవతా సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ఈజిప్ట్ కోరింది. ఈజిప్టుతో పాటు జోర్డాన్(Jordan) కూడా ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించింది. పౌరులు ఉన్న ప్రాంతాలపై ఇజ్రాయెల్ భద్రతా దళాలు పదేపదే దాడులు చేస్తున్నాయని.. ఇది తప్పు అని సౌదీ అరేబియా ఖండించింది.




Tags:    

Similar News