జగన్ పెండింగ్ హామీల చిట్టా ఇదీ..

Update: 2023-12-11 12:01 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. మరో నాలుగైదు నెలల్లో జరిగే సార్వత్రిక పోరు కోసం అన్ని పార్టీలూ రంగంలోకి దిగాయి. చంద్రబాబు నాయుడు బెయిల్‌పై జైలునుంచి బయటికి వచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో మరింత పకడ్బందీగా వ్యూహాలను రచిస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరో ఎత్తు. పెన్షన్ పెంపు, అమ్మఒడి వంటి హామీలను కొంతమేరకు నెరవేర్చినప్పటికీ కొన్ని కీలక హామీలను నెరవేర్చకపోవడం వైసీపీకి ఇబ్బందిగా మారింది.

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి పెండింగ్ హామీలు కూడా ఓ కారణం. ఉద్యోగ నియామకాలను ఆశించినమేరకు చేపట్టకపోడంతో యువత వ్యతిరేకంగా ఓటేసింది. దళితులకు మూడెకరాల భూమి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీలు అమలు కాలేదు. దళితబంధు వంటి పథకాలను కూడా నామమాత్రంగా అమలు చేశారనే విమర్శలు వచ్చాయి. నిరుద్యోగ భృతి ఊసే లేదు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 3వేల ఇస్తామన్న బీఆర్ఎస్ తర్వాత ఆ సంగతి పట్టించుకోనేలేదు. పోడు భూముల పట్టాలు వంటి మరెన్నో హామీలు అరకొరగా అమలయ్యాయి. పెన్షన్లు, రైతుబంధు సాయం పెంపు వంటివి అమలయ్యాయి. అమలు కానీ హామీలను ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఆయుధాలుగా వాడుకున్నాయి.

ఇప్పుడు ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ కూడా 2019 ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక కూడా మరికొన్ని వాగ్దానాలు చేశారు. పెన్షన్ల పెంపు వంటి కొన్ని హామీలు అమలయ్యాయి. కొన్ని అరకొరగా అమలవుతున్నాయి. ఇళ్లపట్టాలను వంకల్లో వాగుల్లో ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని కీలక హామీలను జగన్ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది.

ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీలు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టుకున్న ప్రజల ఆశలు నీరుగారాయి. జగన్ ఈ అంశంపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడం లేదు. దీనికి కారణం తనపై ఉన్న అవినీతి కేసులే అనే విమర్శలు వస్తున్నాయి. ఈ హామీ ఇక ఎన్నటికీ నెరవకపోవచ్చు. రాజధానిని విశాఖ తరలించడంలో అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గల్లంతయ్యాయి.

ఎన్నికల్లో జగన్ ఇచ్చిన మరో కీలక హామీ సంపూర్ణ మద్య నిషేధం. ఇది కూడా సరిగ్గా అమలు కావడం లేదు. దశలవారీగా నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పినా ఎక్కడబడితే అక్కడ మద్యం అందుబాటులో ఉంది. పైగా ధరలను విపరీతంగా పెంచి, పిచ్చిపిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చారు. వైసీపీ నేతలు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఏపీని సస్యశ్యామలం చేసే కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదు. పైగా పనుల్లో లోపాలు కనిపించడంతో విమర్శలు వచ్చాయి. అధికారంలోకి వస్తే 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న జగనన్న హామీ పరిస్థితి కూడా అంతే. 7 లక్షల ఇళ్లను పూర్తి చేశామని, మరో 5 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అన్నీ కలిపినా హామీలో సగం మాత్రమే పూర్తయినట్లు అంచనా. ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఒక సెంట్ స్థలాన్ని, అదీ నివాస ప్రాంతాలకు చాలా దూరం ఇచ్చారు.

ఉద్యోగాల విషయానికి వస్తే ఎక్కువగా పోలీసు ఉద్యోగాలు, గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాలనే భర్తీ చేశారు. మెగా డీఎస్సీ ఊసు లేదు. విశాఖకు మెట్రో రైల్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అడ్డుకట్ట, 45 ఏళ్లు దాటిన వారికి పెన్షన్, చెరువుల పునరుద్ధరణ, కౌలు రైతులకు సాయం, బీమా, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి హామీలు ముందు కదల్లేదు. ఎన్నికల నగారా మోగేలోపు వీటిని అమలు చేయడం అసాధ్యం. పెండింగ్ హామీల ప్రభావం ఏ ఎన్నికల్లోనైనా తప్పకుండా కనిపిస్తుంది. జగన్ ఈ గండాన్ని గట్టెక్కుతారో లేదో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News