China: 10 నిమిషాల్లో లీటర్ లిక్కర్ తాగాలని పందెం.. ఆ తర్వాత ఏమైందంటే..

Update: 2023-10-05 07:11 GMT

ఆఫీస్‌లలో పార్టీలు జరగడం వెరీ కామన్. సందర్భం వచ్చినప్పుడల్లా ఉద్యోగులంతా కలిసి ఫుడ్, లిక్కర్ వంటి పార్టీలు చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక ఆఫీస్‌లో నిర్వహించిన పార్టీలో కంపెనీ బాస్ ఛాలెంజ్ విసిరాడు. అందరికంటే ముందుగా మద్యం తాగిన వ్యక్తికి భారీ నగదు బహుమతి అందిస్తానని పందెం కాసాడు. అయితే తొలుత ఎవరూ ముందుకు రాలేదు. ఆ నగదు బహుమతిని 4 రెట్లు చేయడంతో ఓ వ్యక్తి తాను ఆ ఛాలెంజ్‌లో పాల్గొంటానని ప్రకటించాడు. దీంతో 10 నిమిషాల్లోనే లీటర్ మద్యం బాటిల్‌ను అందరూ చూస్తుండగానే తాగేశాడు. కానీ ఆ తర్వాతే అసలు స్టోరీ మొదలైంది. సరదా మొదలైన ఆ పందెం కాస్త చివరికి విషాదంగా మారింది.

చైనాలోని ఓ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఆఫీసులో పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో మద్యం తాగే ముందు కంపెనీ బాస్, ఉద్యోగుల మధ్య పందెం ప్రస్తావన వచ్చింది. బాస్ యాంగ్ ఉద్యోగులతో పందెం కాశాడు. 10 నిమిషాల్లో ఒక లీటర్ మద్యం తాగిన వారికి రూ.5 వేల యువాన్ లు (సుమారు రూ.58వేలు) బహుమతిగా ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ దానికి ఎవరూ స్పందించలేదు. దాంతో రూ. 10 వేల యువాన్ లు (సుమారు. 1.15 లక్షలు) ఇస్తానని ప్రకటించాడు. అయినా కూడా ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం బాస్ యాంగ్ ఏకంగా రూ. 20వేల యువాన్ లు (సుమారు రూ. 2.31 లక్షలు) ఆఫర్ ఇచ్చాడు.

దీంతో ఝాంగ్ అనే ఉద్యోగి బాస్ కాసిన పందెంకు ఒప్పుకున్నాడు. లీటర్ మద్యం బాటిల్ సీల్ తీసి గటగటామని మొత్తం తాగాడు. బాస్ ఇచ్చిన 10 నిమిషాల లోపే బాటిల్ లేపిసిన ఝాంగ్.. పూర్తిగా తాగేసి ఖాళీ సీసాను కింద పడేశాడు. దీంతో ఆ ఛాలెంజ్ గెలిచి ఏకంగా రూ.2.31 లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఛాలెంజ్‌లో గెలిచి మద్యం బాటిల్ కింద పడేయగానే.. ఝాంగ్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా భయపడిన ఝాంగ్ తోటి ఉద్యోగులు.. వెంటనే అతడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డాక్టర్లు.. ఝాంగ్‌ను పరీక్షించగా.. అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఆల్కమాల్ పాయిజనింగ్, ఆస్పిరేషన్ న్యుమోనియా, ఊపిరాడకపోవడం, కార్డియాక్ అరెస్ట్ లాంటి కారణాలతో అతను మరణించి ఉంటాడని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News