దొంగతనం మీద స్టింగ్ ఆపరేషన్ కు వెళ్ళిన వాళ్ళనే దోచేశారు
సమాజంలో ఏం జరుగుతోందో చూపించేది మీడియా. జరిగిన వాటిని ఎలా జరిగాయో కూడా చెబుతూ ఉంటుంది. వీటి గురించి మీడియా చాలానే కష్టపడుతూ ఉంటుంది. స్టింగ్ ఆపరేషన్లు చేస్తుంటారు. అలా దొంగతనాలు ఎలా జరిగాయో తెలుసుకోవడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది. వాళ్ళనే దోచుకుని వెళ్ళిపోయారు దొంగలు.
అమెరికాలోని షికాగో నగరంలో జరిగింది ఇది. అక్కడ ఆయుధాలతో బెదిరించి దొంగతనాలకు, దోపిడీలకు ఓ ముఠా పాల్పడుతోంది. దాని మీద స్టింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళింది అక్కడి యూనివిజన్ టీవీ ఛానెల్. ఓ రిపోర్టర్, కెమెరామెన్ షికాగోలోని నార్త్ మిల్వాకే అవెన్యూ ప్రాంతానికి స్టింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళారు. అక్కడ వీడియో రికార్డింగ్ కోసం రెడీ అవుతుండగా...ఒక నల్లటి ఎస్యూవీలో ముగ్గురు దొంగలు వచ్చి తుపాకీతో బెదిరించి రిపోర్టర్, కెమెరా మెన్ నుంచి డబ్బులు, ఫోన్లే కాకుండా కెమెరాలాంటివి కూడా దోచుకుని వెళ్ళిపోయారు. వచ్చిన ముగ్గురూ నల్లటి ముసుగులు కూడా ధరించి వచ్చారు.
ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. మా మీద ఇలాంటి వార్త వస్తుందని, అది మేమే రాయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, ఊహించలేదు కూడా. ఏ అంశం మీద అయితే రిపోర్ట్ చేస్తున్నామో అందులో మేమే బాధితులంగా మారుతామని అనుకోలేదు అని చెబుతున్నారు యూనివిజన్ రిపోర్టర్. మాకు అర్ధం అయింది ఏంటంటే...దొంగతనాలు అలాంటి విషయాల్లో రిపోర్టింగ్, స్టింగ్ ఆపరేషన్లు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాకు ఇదొక హెచ్చరిక అని చెబుతున్నారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.