Zoleka Mandela: నెల్సన్‌ మండేలా మనవరాలు కన్నుమూత

Update: 2023-09-27 03:03 GMT

"దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష, జాత్యహంకారం కోసం పోరాడి ఆ దేశ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన నెల్సన్‌ మండేలా మనవరాలు జొలేకా మండేలా (43) కన్నుమూశారు."(Zoleka Mandela) ప్రముఖ రచయిత, ఉద్యమకారిణి కూడా అయిన జొలేకా.. రొమ్ము కేన్సర్‌తో బాధపడుతూ చిన్న వయసులోనే మృతి చెందారు. కేన్సర్ చికిత్స కోసం ఈ నెల 18న ఆమె ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి సెప్టెంబర్‌ 25 (సోమవారం) సాయంత్రం ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులతోపాటు ఆమె శరీరంలోని కాలేయం, మెదడు, వెన్నుపాము వంటి ఇతర ప్రధాన భాగాలకు క్యాన్సర్‌ కణాలు వ్యాపించినట్టు పేర్కొన్నారు.

జొలేకా 1980లో జన్మించారు. ఆమె చనిపోవడానికి ముందు వరకు కూడా రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, న్యాయం కోసం పోరాడే ఉద్యమకారిణిగా పనిచేశారు. ఆమెకు నలుగురు పిల్లులు. 32 ఏళ్ల వయసులోనే తొలిసారి కేన్సర్ బారినపడిన ఆమె చికిత్సతో కోలుకున్నారు. అయితే, 2016లో మరోమారు అది తిరగబెట్టింది. ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగలేదు. జొలేకా ప్రాణాలు బలితీసుకుంది. 2010లో ఆమె 13 ఏళ్ల కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పటి నుంచి రోడ్ సేఫ్టీ క్యాంపెయినర్‌గానూ అవగాహన కల్పిస్తున్నారు.

తనకు కేన్సర్ సోకిన విషయంతో పాటు చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, డ్రగ్స్ అలవాటు వంటి విషయాలను ఇటీవలే ఆమె డాక్యుమెంటరీ ద్వారా తెలిపారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని అనుభవించిన నెల్సన్ మండేలా ఆ తర్వాత ఆ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు. జొలేకా మృతికి నెల్సన్ మండేలా ఫౌండేషన్ సంతాపం తెలిపింది.

Tags:    

Similar News