ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్.. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి అందలో వివాదాలు సర్వ సాధారణంగా మారాయి. మస్క్ మరోసారి ఓ కొత్త రూల్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి వెరిఫైడ్ అకౌంట్ యూజర్స్ 10 వేల పోస్టులు మాత్రమే చూడొచ్చు. అన్ వెరిఫైడ్ యూజర్స్ 1000 పోస్టులు, న్యూ యూజర్స్ 500 ట్వీట్లు మాత్రమే చూడొచ్చని మస్క్ ప్రకటించారు. తొలుత వెరిఫైడ్ ఖాతాదారులకు 6000, అన్ వెరిఫైడ్ వారికి 600, కొత్త ఖాతాదారులకు 300 పోస్టుల లిమిట్ పెట్టిన ఎలన్ మస్క్ కొన్ని గంటల తర్వాత దాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా ట్విట్టర్ యూజర్లు ఇతరుల ట్వీట్లను చూడాలంటే అకౌంట్లో తప్పనిసరిగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది వరకు లాగిన్ అవ్వకపోయనా.. వెబ్ బ్రౌజర్ ద్వారా ఇతర ఖాతాదారాల ట్వీట్లను చూసే అవకాశం ఉండేది. కానీ, ఈ సౌకర్యాన్ని ట్విట్టర్ నిలిపివేసింది. దీంతో యూజర్లు ట్విట్టర్ పై మండిపడుతున్నారు. అంతేకాకుండా ట్విట్టర్ డౌన్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చి నిరసన తెలుపుతున్నారు. మస్క్ తీసుకున్న ఈ నిర్ణయంపై ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే కూడా స్పందించాడు. ఇలాంటి నిర్ణయాలతో ట్విట్టర్ ను నడపడం కష్టమని అభిప్రాయపడ్డాడు.