మనుషులు తప్పు చేస్తే జైలు శిక్ష పడుతుందని అందరికీ తెలుసు. అప్పుడప్పుడు పందాల్లో పట్టుబడ్డ కోళ్లను లాకప్ లో పెట్టిన ఘటనల గురించి విన్నాం. కానీ కొన్ని మేకలు దురదృష్టమేమోగానీ తెలియక మేసిన పాపానికి ఏడాది పాటు బంధీలుగా శిక్ష అనుభవించాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అసలింతకీ ఈ దారుణం ఎక్కడ జరిగింది..? ఆ మూగజీవాలు చేసిన తప్పేంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీ చదివేయండి.
పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో ఈ వింత ఘటన జరిగింది. 2022 డిసెంబర్ 6న సచిబ్ రాజీబ్ అనే వ్యక్తికి చెందిన 9 మేకలు స్థానిక స్మశాన వాటికలోకి వెళ్లాయి. అక్కడున్న గడ్డి, చెట్ల ఆకులు తిన్నాయి. విషయం కాస్తా బారిసల్ సిటీ కార్పొరేషన్ అధికారుల దృష్టికి వెచ్చింది. దీంతో వెంటనే చర్యలు ప్రారంభించిన అధికారులు స్మశానంలోకి అక్రమంగా చొరబడి గడ్డి మేశాయన్న కారణంతో 9 మేకలను వెంట తీసుకెళ్లిపోయారు. ఏడాదిగా బరిసల్ కార్పొరేషన్ ఆఫీసు వెనుక బంధీలుగా పెట్టారు. తన మేకలను విడిపించుకునేందుకు యజమాని ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఇటీవల బరిసల్ సిటీ కార్పొరేషన్‌కు కొత్త మేయర్ ఎన్నిక జరిగింది. దీంతో మేకల యజమాని సచిబ్ రాజీబ్ మేయర్‌ను సంప్రదించి తన గోడు చెప్పుకున్నాడు. అతని బాధ విని సానుకూలంగా స్పందించిన మేయర్.. మేకలను విడిచిపెట్టాలని ఆదేశించారు. మేయర్ చొరవతో అధికారులు ఏడాదిగా బంధీలుగా ఉన్న 9 మేకలను రాజీబ్‌కు అప్పగించారు. దీంతో అతను తన మేకలను చూసుకొని ఊపిరిపీల్చుకున్నాడు.
అయితే భారత్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 2016 ఫిబ్రవరిలో బబ్లీ అనే పేరున్న మేకను అరెస్ట్ చేశారు. చత్తీస్ ఘడ్ లోని జనక్ పుర్ పార్కులో పూలను మేసిందన్న కారణంతో మేకను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత దాన్ని రిలీజ్ చేసినా.. ప్రాపర్టీ డ్యామేజ్ చేసిందన్న కారణంతో మేక యజమాని అబ్దుల్ హసన్ పై కేసు పెట్టారు.