రష్యాలో కిమ్ చక్కర్లు.. ఏమేం చూశాడో తెలిస్తే....

Update: 2023-09-17 04:06 GMT

పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోగాని పోదు అంటారు. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తీరు అలాగే ఉంది. మిత్రదేశమైన రష్యాకు వెళ్లిన ఆయన క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు. అందమైన పర్యాటక ప్రాంతాలు, స్మారకాలు, మ్యూజియాలు కాకుండా తనకు నచ్చిన చోట్ల పర్యటిస్తున్నాడు. తుపాకులు, బాంబులు, అణ్వాయుధాల కేంద్రాలను చూస్తూ చిన్నపిల్లాడిలా తెగ మురిసిపోతున్నాడు. వాటిని తమ దేశంలోనూ తయారు చేయించడం, లేకపోతే దిగుమతి చేసుకోవడం వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నాడు.

రష్యా టూర్‌కు వెళ్లిన కిమ్ శనివారం వ్లాదివోస్తోక్ ఆయుధాగారాన్ని సందర్శించాడు. రష్యా శాస్త్రవేత్తులు అభివృద్ధఇ చేసిన అణు బాంబర్లను, హైపర్‌సానిక్‌ మిస్సైళ్లను, శక్తిమంతమైన యుద్ధ విమానాలను, యుద్ధనౌకలను దగ్గరికి వెళ్లి మరీ చూశాడు. టు160, టు95, టు22 బాంబర్లు, మిగ్ 31 యుద్ధవిమానం, దానిపై నుంచి వదిలే కింజాల్ క్షిపణులు ఎలా పనిచేస్తాయని, వాటి తయారీ ఖర్చు ఎంత అని, పేటెంట్ వంటి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు దగ్గరుండి అన్నీ వివరించారు. కిమ్ పర్యటన ఓ దేశాధినేత మరో దేశానికి వచ్చినట్లు కాకుండా, ఓ దేశ సైన్యాధ్యక్షుడు వచ్చి, సైనిక వ్యవహారాలు నడిపినట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం, కిమ్ అణు పరీక్షలకు సహన్నాహాలు, క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కిమ్ పర్యటనలో పలు కీలక సైనిక ఒప్పందాలు జరగనున్నాయి. కిమ్ 2019లో తొలిసారి రష్యాకు వెళ్లినప్పుడు కూడా ఆయుధాలపైనే మక్కువ చూపాడు.

Tags:    

Similar News