రష్యా విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మృతి

Update: 2023-08-24 04:55 GMT

ఈ ఏడాది జూన్‌లో రష్యా సైన్యంపై తిరుగుబావుటా ఎగురవేసి వెనక్కి తగ్గిన ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్‌(Yevgeny Prigozhin) దుర్మరణం పాలయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో ప్రిగోజిన్‌తో పాటు అందులో ఉన్న మరో 9 మంది చనిపోయారని రష్యా అధికారులు తెలిపారు. మాస్కోకు ఉత్తరాన ఉన్న త్వేర్‌ రీజియన్‌లో ఎంబ్రాయర్‌-135 (EBM-135BJ) విమానం కూలిపోయిందని, ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక కమిషన్‌ను నియమించినట్టు రష్యా విమానయాన సంస్థ రోసావియాత్సియా ప్రకటించింది.




 


రెండు నెలల కిందట పుతిన్‌పై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ (Ukraine)పై సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్‌.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. ఉక్రెయిన్‌లో తమ బలగాలకు ఎదురవుతున్న సవాళ్ల విషయంలో రష్యా రక్షణ శాఖపై బహిరంగంగా తన అసంతృప్తి వ్యక్తం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. పుతిన్‌ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తాము చేస్తున్నది న్యాయం కోసం పోరాటమేనని, తిరుగుబాటు కాదని ప్రిగోజిన్‌ అప్పట్లో పేర్కొన్నారు. అయితే బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వం చేసి వాగ్నర్‌ బృందాలు మరింత ముందుకెళ్లకుండా ఆపారు. దీంతో వెనక్కి తగ్గిన వాగ్నర్‌ చీఫ్‌.. రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాలను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించడంతో తిరుగుబాటు యత్నానికి బ్రేక్‌ పడినట్లయ్యింది.




 


మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌‌కు వెళుతున్న ప్రైవేటు జెట్‌ విమానంలో ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కుజెంకినో విలేజ్ వద్ద కూలినట్లు ముందుగా సమాచారం అందిందని వివరించారు రష్యా అధికారులు. చనిపోయిన ప్రయాణికుల్లో ప్రిగోజిన్‌ కూడా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అందరూ స్పాట్​లోనే చనిపోయారని , సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని రష్యా ఏవియేషన్ ఏజెన్సీ అధికారులు ప్రకటించారు. అయితే జూన్ 23న అకస్మాత్తుగా పుతిన్​పై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ మృతిపై సందేహాలు నెలకొన్నాయి. ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని హెచ్చరించి.. బెలారస్​కు వెళ్లిన ఆయన రెండు నెలలకే విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోవడం మిస్టరీగా మారింది.




 




 




Tags:    

Similar News