పాక్ అడుక్కు తింటోంది, భారత్ చంద్రుడిని చేరింది.. నవాజ్ షరీఫ్ సంచలనం
భారత్ పేరెత్తితేనే విషం చిమ్మే పాకిస్తాన్ నేతలకు క్రమంగా వాస్తవాలను గ్రహిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రవాసంలో ఉన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మన దేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. పాక్ నేతలపై దుమ్మెత్తిపోశారు. రెండు దేశాలు ఒకే కాలంలో అవతరించినా భారత్ శరవేగంతో అభివృద్ధి చెందుతుంటే పాక్ రోజురోజుకు అధోగతి పాలవుతోందని అన్నారు.
‘‘పాకిస్తాన్ అడుక్కుతింటోంది. డబ్బులు కావాలని ప్రపంచ దేశాల ముందు చేయి చాస్తోంది. భారత్ మాత్రం స్వశక్తితో చంద్రయాన్ ప్రాజెక్టుతో చంద్రుడిని చేరుకుంది. ప్రతిష్టాత్మకమైన జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. పాక్ సైనికనేతలు, జడ్జీలు దేశాన్ని భ్రష్టుపట్టించారు. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరి ప్రజలు పేదరికంలో నలిగిపోతున్నారు. మన ప్రధాని బిచ్చగాడిగా దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు. భారత్ సాధించిన విజయాలను మనం ఎందుకు సాధించలేకపోయారు. దీనికి కారణం ఎవరు?’’ అని ప్రశ్నించారు.
లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన తన పీఎంఎల్ఎన్ పార్టీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత్ దగ్గర కేవలం వందల కోట్లు డాలర్లు మాత్రమే ఉండేవని ఇప్పుడు విదేశీ మారకద్రవ్య నిల్వలు 600 బిలియన్లకు చేరాయని నవాజ్ ప్రశంసించారు. పాకిస్తాన్ రోజురోజుకూ అప్పుల్లో కూరుకుపోయి ప్రపంచ ఆర్థిక సంస్థలను దేబిరిస్తోందని మండిపడ్డారు. 2019లో అవినీతి కేసులో జైలు శిక్ష పడ్డంతో నవాజ్ అప్పటికి ఆర్మీ చీఫ్ బాజ్వా సాయంతో దేశం నుంచి పారిపోయి ప్రస్తుతం లండన్‌లో ఆశ్రయం పొందుతున్నారు.