Canada vs India : ఖలిస్తాన్ గ్రూపులతో పాక్ ఐఎస్ఐ రహస్య మీటింగ్..!

Byline :  Krishna
Update: 2023-09-21 13:54 GMT

భారత్ - కెనడా మధ్య వైరం రోజు రోజుకు ముదురుతుంది. ఖలిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడా, భారత ప్రభుత్వాల మధ్య రేగిన వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. రాయబారులను పరస్పరం బహిష్కరిచుకున్న రెండు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్ - కెనడా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు కెనడాలోని ఖలిస్తాన్ అధిపతులతో రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. వాంకోవర్‌లో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సమావేశంలో సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గుర్‌పత్వంత్‌సింగ్ పన్నున్ సహా ఇతర పెద్దలు హాజరైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. భారత వ్యతిరేక ప్రచారాన్ని వీలైనంత త్వరగా వ్యాప్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.

కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలకు పాక్ ఐఎస్ఐ కొన్ని నెలలుగా భారీగా నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం, పోస్టర్లు, బ్యానర్లు ముద్రించడం వంటి వాటికి ఈ సొమ్మును ఖర్చు చేస్తున్నారట. భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ గూఢచారులు - ఖలిస్తానీ ఉగ్రవాదుల మధ్య రహస్య సమావేశం జరగడం గమనార్హం.


Tags:    

Similar News