Air Canada: టేకాఫ్ సమయంలో విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-11 06:42 GMT

మరికాసేపట్లో టేకాఫ్ అవుతుందనగా, విమానంలోని ఓ ప్రయాణికుడు చేసిన పని.. విమానయాన సిబ్బందితోపాటు తోటివారికి చెమటలు పట్టించింది. గాల్లోకి ఎగురబోతుండగా.. విమానం డోర్ తెరిచి ఆకస్మాత్తుగా కిందకు దూకేశాడు. సిబ్బంది వారిస్తున్నా.. వినకుండా దాదాపు 20 అడుగుల ఎత్తునుంచి ఒకేసారి కిందకు దూకాడు. ఎయిర్‌ కెనడా (Air Canada) విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లాల్సిన ‘బోయింగ్‌ 747’ విమానం టొరంటో నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు హఠాత్తుగా క్యాబిన్‌ తలుపు తెరిచాడు. సిబ్బంది అతడిని అడ్డుకునే లోపే కిందకు దూకేశాడు. దీంతో తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 20 అడుగుల ఎత్తు నుంచి అతడు దూకడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎయిర్‌ కెనడా తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

అతడు తన సీటుపై కూర్చోకుండా క్యాబిన్ డోర్(door) తెరిచి బయటకు దూకినట్లు విమానయాన సిబ్బంది చెబుతున్నారు. అతడిని ఆపేందుకు ప్రయత్నించామని, అయిప్పటికీ వినకుండా దూకాడని అంటున్నారు. అతను 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడని ఆ క్రమంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయని సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రాంతీయ పోలీసులు, సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియలేదు. ఎయిర్ కెనడా వెబ్‌సైట్(website) ప్రకారం ఈ ఘటన వల్ల బోయింగ్ 747 టేకాఫ్‌లో ఆరు గంటల ఆలస్యమైందని ప్రకటించింది. అయితే ఈ చర్యకు పాల్పడిన ప్రయాణికుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News