అగ్రరాజ్యం అమెరికాలో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అడుగడుగునా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. పర్యటనలో భాగంగా తీరిక లేకుండా ఉన్న మోదీ.. నిన్న వైట్ హౌజ్ లో అధికారిక విందులో పాల్గొన్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో కలిసి ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధానిని ఓ అమెరికన్ జర్నలిస్ట్.. భారత్‌లో మైనారిటీల హక్కులను మెరుగుపరచడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్న వేశారు. దీనికి మోదీ ఏం సమాధానం ఇచ్చారంటే..
‘ఈ ప్రశ్న నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అనేది మన రక్తంలో నిండిపోయి ఉంది. ప్రజాస్వామ్యాన్నే ఊపిరిగా భావిస్తున్నాం. అది మన రాజ్యాంగంలోనే ఉంది. మానవ విలువలు, హక్కులు లేకపోతే ఏ దేశంలోనూ ప్రజాస్వామ్యం ఉండదు. ఇందులో ఎవరిపైన వివక్ష అనేది ఉండదు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంపైనే భారత ప్రభుత్వం నడుస్తోంది. మా దేశంలో మతం, కులం, వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయ’ని మోదీ స్పష్టం చేశారు.