అబుదాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ

By :  Krishna
Update: 2024-02-14 14:43 GMT

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు. రూ.700 కోట్లతో బోచసన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ మందిరాన్ని 27 ఎకరాలలో సుందరంగా నిర్మించారు. ఇప్పటికే దుబాయ్లో రెండు హిందూ ఆలయాలు ఉన్నప్పటికీ.. అవి విల్లా తరహాలో ఉంటాయి. కానీ బీఏపీఎస్ ఆలయం మొత్తం హిందూ శైలిలో ఉంటుంది. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్షయ్‌ కుమార్‌, వివేక్‌ ఒబెరాయ్‌, శంకర్ మహదేవన్‌ హాజరయ్యారు.

స్టీల్, సిమెంట్ వాడలేదు..

ఈ ఆలయ నిర్మాణంలో స్టీల్, సిమెంట్ వాడలేదు. అయోధ్య ఆలయం మాదిరిగానే అత్యాధునిక టెక్నాలజీతో దీనిని నిర్మించారు. రాజస్థాన్, గుజరాత్కు చెందిన కార్మికులు, నిపుణుల మూడేళ్లు శ్రమించి 402 పాలరాతి స్తంభాలను చెక్కారు. ఈ ఆలయ పునాదుల్లో 100 సెన్సార్లను ఏర్పాటు చేశారు. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత మార్పులను ఇవి ఎప్పటికప్పుడు తెలియజేస్తాయి. ఈ ఆలయంలో ప్రార్థన మందిరం, విజిటర్స్ సెంటర్, గార్డెన్లు, లైబ్రరీ, గ్యాలరీ, ఎగ్జిబిషన్‌ సెంటర్లు, 5వేల మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ప్లే గ్రౌండ్ ఉన్నాయి.

ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా..

ఆ ఆలయంలోని ఏడు గోపురాలను యూఏఈలోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దారు. గోడలపై రామయణాన్ని చెక్కారు. బయటి గోడలపై ప్రసిద్ధ నాగరికతలను చెక్కారు. 2014లో మోదీ యూఏఈలో పర్యటించాక ఈ ఆలయ నిర్మాణం పురుడుపోసుకుంది. 2018లో ఈ ఆలయానికి దుబాయ్ నుంచి వర్చువల్ పద్ధతిలో మోదీ శకుస్థాపన చేశారు. మోదీ ప్రధాని అయ్యాక యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి. ఖతర్ లోనూ మోదీ పర్యటించనున్నారు.


Tags:    

Similar News