Porcelain Vessel Auction: డబ్బులెక్కువై కాదు.. ప్రేమతో కొన్నారు

Byline :  Kalyan
Update: 2023-08-27 11:06 GMT

వేలం పాటలో పురాతన వస్తువులను కొంతమంది ఎక్కువ ధర పెట్టి కొనడం చూస్తుంటాం. కానీ, వేలం నిర్వాహకులు సహా ఎవ్వరు ఊహించని ధర పలికితే.. నోరెళ్లబెట్టి చూస్తాం. అలాంటి ఘటనే ఇంగ్లండ్ లో జరిగింది. ఓ చిన్ని పింగానీ పాత్రను వేలంలో పెట్టగా ఊహించని ధర పలికింది. ఇంగ్లండ్ లోని డోర్చెస్టర్ కు చెందిన డ్యూక్స్ ఆక్షనీర్స్ సంస్థ తరచూ పురాతన వస్తువులను వేలం వేస్తుంటుంది. ఇటీవల ఓ పురాతన పిగాణి పాత్రను వేలం వేయగా దానికి ఏకంగా రూ.1.09 కోట్లు పలికింది. అది చూసిన వేలం నిర్వాహకులు అవాక్కయ్యారు.

వేలంలో పెట్టిన పింగాణి పాత్రకు మహా అయితే రూ.10వేల ధర పలుకుతుందని అనుకున్నారు. దాంతో వేలం పాటను రూ.3,169 నుంచి ప్రారంభించారు. ఈ వేలంలో చాలామంది పాల్గొని బిడ్ వేశారు. అందులోని కొంతమంది నిపుణులైన బిడ్డర్లు.. ఇది చైనాకు చెందిన మింగ్ వంశీకుల నాటి వస్తువని గుర్తించారు. దాంతో వేలంపాట ఒక్కసారిగా మారిపోయింది. అక్కడికి వచ్చినవాళ్లంతా అనూహ్యంగా ధర పెంచుకుంటూ పోయారు. చివరకు ఇంగ్లండ్ కు చెందిన ఓ పురావస్తు సేకర్త దీన్ని 1.04 లక్షల పౌండ్లు (రూ.1.09 కోట్లు)కు సొంతం చేసుకున్నాడు. మింగ్ వంశీకులు చైనాను 1368 నుంచి 1644 కాలంలో పాలించారు. వాళ్ల హయాంలో తయారైన వస్తువులు అత్యంత నాణ్యమైనవి, కళాత్మకమైనవి అని ప్రతీతి.


Tags:    

Similar News