గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది..ఏపీ సీఎం జగన్

Update: 2023-07-08 08:08 GMT

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు దినోత్సవ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2022–ఖరీఫ్‌లో పంటను కోల్పోయిన రైతులకు బీమా పరిహారాన్ని విడుదల చేశారు. ఈ క్రమంలో బహిరంగ సభలో సీఎం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల అకౌంట్లలో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

సభలో సీఎం మాట్లాడుతూ..."సున్నా వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నాం. పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నాం. మరో 30 ఏళ్లు ఉచితంగా రైతులకు విద్యుత్‎ను అందిస్తాం. పంట కొనుగోళ్ల కోసం రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం. సాగు సమస్యలను తీర్చేందుకు రైతుల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నాం. విత్తడం మొదలు పంట కోసే వరకు ఆర్బీకే సేవలు అందిస్తున్నాం. గత ప్రభుత్వం కరువు భత్యం విషయంలో మోసం చేసింది.

100 సంవత్సరాలకు పైగా చుక్కల భూములుగా మిగిలిపోయిన, 2లక్షలకు పైగా ఎకరాలకు సంబంధించి 87560 మంది రైతులకు సంపూర్ణ భూ హక్కు పత్రాలు ఇవ్వడం మరో గొప్ప విజయం. పశువుల కోసం 350 ఆంబులెన్సుల సేవలను అందిస్తున్నాం. పాడి రైతులకు ఆదాయం పెంచేందుకు , వారికి తోడుగా ఉండేందుకు అముల్‎ను తీసుకువచ్చాము. ప్రైవేటు డైరీల గుత్తాధిపత్యాన్ని తగ్గించాం.ఇంటింటికీ రేషన్ అందిస్తూ పేదలకు సేవ చేస్తున్నాం. చిరుధాన్యాల సాగును కూడా ప్రోత్సహిస్తున్నాం. ఏపీలో వ్యవసాయాన్ని చూసి ప్రపంచం అబ్బురపడే రోజులు ముందున్నాయ్. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నాం. రైతులకు ఉచిత బీమా అందిస్తున్నాం"అరి జగన్ తెలిపారు.




Tags:    

Similar News