కోర్టు మెట్లు ఎక్కనున్న బ్రిటన్ రాకుమారుడు...

Update: 2023-06-03 02:25 GMT

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 రెండవ కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ మొదటిసారిగా కోర్టు మెట్లు ఎక్కనున్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని తనపై ఆరోపణలు చేసిన ఓ వార్తా సంస్థపై హ్యారీతో పాటు ఇతర ప్రముఖులు కోర్టులో కేసు వేసిన విషయం తెలిసింది. ఈ కేసు విచారణ నేపథ్యంలోప్రిన్స్ హ్యారీ త్వరలో లండన్‌ హైకోర్టు మెట్లు ఎక్కి బోనులో నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృస్టి ప్రిన్స్ హ్యారీపై పడింది. ఈ కేసు బ్రిటన్‎లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. 130 సంవత్సరాల తరువాత ఇలా రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కోర్టులో సాక్ష్యం ఇవ్వడం మొదటిసారి కానుంది.



బ్రిటన్‌కు చెందిన మిర్రర్‌ గ్రూప్‌ అనే వార్తా సంస్థ అక్కడి అనేకమంది సెలబ్రిటీల పర్సనల్ విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేకంగా వ్యవహరించిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. వారి వార్తల సేకరణ కోసం సెలబ్రిటీల ఫోన్‌ హ్యాకింగ్‌‎కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రిన్స్‌ హ్యారీతోపాటు మరికొంత మంది ప్రముఖులు మిర్రర్ గ్రూప్‎పైన లండన్ కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణ త్వరలో జరుగనుంది. ఈ క్రమంలో ప్రిన్స్ హ్యారీ తొలిసారి కోర్టులో సాక్ష్యం చెప్పనున్నారు. 1870లోనూ ఓ డివోర్స్ కేసులో రాజకుటుంబానికి చెందినఎడ్వర్డ్‌-7 కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పారు. మరోసారి 20ఏళ్ల తర్వాత ఓ పరువునష్టం కేసులో ఎడ్వర్డ్‌-7 సాక్ష్యమిచ్చారు. ఆ తరువాత 130 ఏళ్లకు ఇప్పటి రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం ఇవ్వనున్నారు. 

Tags:    

Similar News