ఒక్క గంటలోనే మునిగిన నగరం..హాంకాంగ్‎లో వరద బీభత్సం

By :  Aruna
Update: 2023-09-08 10:27 GMT

టైఫూన్‌ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హాంకాంగ్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాలతో హాంకాంగ్, దక్షిణ చైనాలు అతలాకుతలం అయ్యాయి. గురువారం రాత్రి కురిసిన కుంభవృష్టితో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకే ఒక్క గంటలో రికార్డు స్థాయిలో 6.2 అంగుళాల మేర వర్షపాతం నమోదు కావడంతో నగర వీధులన్నీ జలమయం అయ్యాయి. సబ్‎వేలు నీట మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు స్కూల్స్‎కు సెలవు ప్రకటించారు. హాంకాంగ్ నగరంలో 140 ఏళ్లలో ఇలాంటి జల విపత్తును చూడలేదని తాజాగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వరద కారణంగా ఇప్పటి వరకు నగరంలో 63 మంది ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు ప్రారంభించారు.

గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 లోపు హాంకాంగ్‎లో అత్యధికంగా 158.1 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. 1884 తర్వాత కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వరద ప్రధానంగా రవాణా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రవాణా సేవలు, బిజినెస్‎లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. కుంభవృష్టిగా వర్కుషాలు కురవడంతో ‘బ్లాక్‌’ హెచ్చరికను గురువారం సాయంత్రమే అధికారులు జారీ చేశారు. స్టాక్‌ మార్కెట్ కూడా తన ట్రేడింగ్‌ను ఆపేసింది. నగరం మొత్తం జలమయం కావడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వరద ప్రభావంతో వాంగ్‌తాయ్‌ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌ పూర్తిగా నీటమునిగింది. వరద ప్రభావం శుక్రవారం సాయంత్రం వరకు తగ్గే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

మరోవైపు దక్షిణ చైనాలోనూ 71ఏళ్లలో చూడనంత వర్షంపాతం నమోదు అయ్యింది. 1952 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. వర్షం కారణంగా గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో వందల కొద్దీ విమానాలు క్యాన్సెల్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.



Tags:    

Similar News