రష్యాలోని మహిళలకు ప్రెసిడెంట్ పుతిన్ కీలక సూచనలు చేశారు. మహిళలు 8 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలకు జన్మనివ్వాలని పిలుపునిచ్చారు. మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్ కౌన్సిల్లో ఆయన ప్రసంగించారు. పెద్ద కుటుంబాలను కలిగి ఉండటం ఎంతో అవసరమని.. జనాభా తగ్గుదలను అరికట్టడానికి ఎక్కువమంది పిల్లలను కలిగి ఉండాలని కోరారు. పెద్ద కుటుంబం కలిగి ఉండటం రష్యాలో ప్రజలందరికీ ఒక కట్టుబాటుగా.. జీవన విధానంగా మారాలని సూచించారు. రష్యన్ కుటుంబాలలో మన అమ్మమ్మలు, ముత్తాతలకు 7 నుండి 8 మంది పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.
కుటుంబ సంప్రదాయాలను కాపాడుకోవడం నైతిక బాధ్యత అని పుతిన్ అన్నారు. 1990 నుంచి రష్యాలో జననాల రేటు పడిపోయిందని.. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి సుమారు మూడు లక్షలకు పైగా ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. కుటుంబం అనేది కేవలం సమాజానికి పునాది మాత్రమే కాదని.. ఆధ్యాత్మికత, నైతికతకు నిదర్శనమన్నారు. భవిష్యత్తు తరాలు రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.