ఈ దేశాలు కూడా సూర్యయాత్రలు చేశాయ్... ఏం సాధించాయంటే!
చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతం కావడంతో భారత్ ఉత్సాహంతో సూర్యయాత్ర చేపట్టింది. మన తొలి సూర్యయాన్ ‘ఆదిత్య ఎల్ 1’ ఉపగ్రహం కాసేపటి కిందట శ్రీహరికోటలోని ఇస్రో లాంచింగ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. లగ్రాంజ్ ఎల్ 1 పాయింట్ నుంచి ఆదిత్య 1 సూర్యుడి ఉపరితలంపై వచ్చే మార్పులను అధ్యయనం చేసి ఇస్రోకు సమాచారం పంపిస్తుంది. సూర్యడిపై పరిశోధనలకు ఉపగ్రహాలను పంపడం కొత్తేమీ కాదు. చంద్రుడిపై మనిషి కాలు మోపడానికి ముందు నుంచే సూర్య అధ్యయనాలు సాగుతున్నాయి. భగభగమండే భానుడిపై దిగడం, అతని సమీపం నుంచి అధ్యయనం చేయడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని లక్షల కి.మీ. దూరం నుంచే పరిశోధనలు సాగిస్తున్నాయి. అమెరికా, యూరప్, రష్యా, జపాన్ తదితర దేశాలు సోలార్ మిషన్లను విజయవంతంగా ప్రయోగించి విలువైన సమాచారాన్ని రాబట్టాయి.
ఎందుకు?
సౌరమండలంలో భాగమైన మన భూగ్రహానికి, సూర్యునితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూర్యరశ్మి లేకపోతే మనం లేం. ఆదిత్యుడిపై వచ్చే మార్పులు భూమిపై ప్రభావం చూపుతాయి. సూర్యుడిమీది హీలియం, అయస్కాంత శక్తి, వాటి ఫలితంగా వాతావరణంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ రహస్యాలను ఛేదించడం సోలార్ మిషన్ల లక్ష్యం.
ఏ దేశాలు..
అగ్రరాజ్యం అమెరికా దివాకరుడిపై ప్రయోగాల్లో ముందుంది. 1960 నుంచి 1969 మధ్యలో యూఎస్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏకంగా ఆరు ఉపగ్రహాలను పంపగా ఒక్కటి మాత్రమే విఫలమైంది. జర్మనీ, యూరోపియన్ స్పేషన్ ఏజెన్సీల(ఈఎస్ఏ)తో కలసి కూడా అమెరికా పలు సూర్యయాన్‌లు చేపట్టింది. జర్మనీ అమెరికాతో కలసి చేయగా, జపాన్ సొంతగా ప్రయోగాలు నిర్వహించింది. గతం రెండు దశాబ్దాల నుంచి హైఎండ్ టెక్నాలజీ మిషన్లు సాగుతున్నాయి.
ముఖ్యమైన మిషన్లు
సోహో(Solar and Heliospheric Observatory): ఈఎస్ఏ, నాసా కలసి 1995 డిసెంబర్లో సోహో మిషన్ చేపట్టాయి. భానుడి అంతర్గత, బాహ్య వాతావరణాన్ని, సౌర వాయువులను ఇది అధ్యయనం చేసింది. సోలార్ సైకిల్, కరోనల్ హోల్స్, సూర్యజ్వాలలు, విస్ఫోటాల గురించి అంతవరకు తెలియని విషయాలు కనిపెట్టింది.
స్టీరియో STEREO (Solar Terrestrial Relations Observatory): ఇది కూడా నాసా మిషనే. 2006లో స్టీరియో ప్రాజెక్టు కింద A, B అనే రెండు సూపర్ క్రాఫ్టులను పంపారు. భూకక్ష్యకు చెరోవైపు ప్రవేశపెట్టిన ఈ ఉపగ్రహాలను స్టిరియోస్కోపిక్ అధ్యయనం చేశాయి. సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లను పరిశీలించాయి. Aతో 2014 అక్టోబర్లో నాసాకు సంబంధాలు తెగిపోగా B ఇప్పటికీ సజావుగా పనిచేస్తోంది.
హినోడ్ Hinode (Solar-B): 2006లో జపాన్ పంపిన ఉపగ్రహం ఇది. సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేయడం దీని పని. సన్ మేగ్నటిక్ డైనమో గురించి సూర్యపవనాలకు, అయస్కాంత క్షేత్రానికి మధ్య ఉన్న సంబంధాల గురించి కొత్త సమాచారం పంపింది.
ఎస్డీవో SDO (Solar Dynamics Observatory): ఇది కూడా నాసా మిషనే. 2010లో వెళ్లిన ఈ ఉపగ్రహం సోలార్ యాక్టివిటీ, అయస్కాంత శక్తిని అధ్యనం చేసింది.
ఇరిస్ IRIS (Interface Region Imaging Spectrograph): 2013లో చేపట్టిన ఈ ప్రయోగంలో సౌరపదార్థాలను అధ్యయనం చేశారు.
సోలార్ ఆర్బిటర్ Solar Orbiter: నాసా, ఈఎస్ఏ కలసి పంపిన ఉపగ్రహం ఇది. సూర్యుడి ధ్రువప్రాంతాలు, భూమికి సూర్యుడికి మధ్య బంధంపై అధ్యయనం చేసింది.
పార్కర్ సోలార్ ప్రోబ్ : ఇదీ అమెరికా మిషనే. 2018లో వెళ్లిన ఈ శాటిలైట్ లక్ష్యం సూర్యుడి అతి చేరువ కక్షలోకి వెళ్లడం. సూర్యుడికి 6.2 మిలియన్ కిమిలోమీటర్లకు చేరులోని గమ్యాన్ని 2025కు చేరుకోనుంది. దీని వేగం గంటకు 6.9 లక్షల కి.మీ. మనిషి తయారు చేసిన అత్యంతవేగ పరికరం ఇదే.