Super Bowl:స్పోర్ట్స్ పరేడ్‌లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, 22 మందికి గాయాలు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-15 04:45 GMT

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో స్పోర్ట్స్‌ పరేడ్‌ జరుగుతుండగా దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మంది దాకా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.

గత ఆదివారం జరిగిన ‘సూపర్‌ బౌల్‌’ ఛాంపియన్ షిప్ లో కాన్సాస్ సిటీ విజేతగా నిలిచింది. గెలిచిన సందర్భంగా కేన్సాస్‌ సిటీ చీఫ్స్‌ పరేడ్‌ నిర్వహిస్తుండగా కాల్పులు చోటుచేసుకున్నాయి. వేలాదిమంది పాల్గొన్న ఈ పరేడ్.. మరికాసేపట్లో ముగుస్తుందనగా కాల్పుల శబ్ధాలు వినిపించాయి. పరేడ్ మార్గం సమీపంలో ఉన్న పెట్రోల్ పంపు నుండి కాల్పుల శబ్దం వినిపించింది. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భీతావహ దృశ్యం కనిపించింది. ఎటునుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు కేన్సాస్‌ సిటీ పోలీస్‌ చీఫ్‌ స్టేసీ గ్రేవ్స్‌ తెలిపారు. పరేడ్‌లో పాల్గొనేందుకు వచ్చిన కొందరు అభిమానులు కూడా ఓ అనుమానితుడిని పట్టుకున్నారని స్టాసీ గ్రేవ్స్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు కేన్సాస్‌ జట్టు ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. కేన్సాస్‌ సిటీ చీఫ్స్‌ ఆర్గనైజర్స్‌ కాల్పుల ఘటనపై స్పందించారు. పరేడ్‌ ముగిసే సమయంలో ఇలా చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. కాల్పుల ఘటన ఒక అవివేకమైన హింస అని ఆ జట్టు పేర్కొంది. బాధితులకు సానుభూతి వ్యక్తం చేసింది.

Tags:    

Similar News