చిలుకను చంపిన కేసులో ఈ ఆడ రాక్షసులకు రెండేళ్ల జైలు శిక్ష

Byline :  Lenin
Update: 2023-08-30 07:26 GMT

ఒళ్లు స్వాధీనం తప్పేంతవరకు మందుకొట్టి అమాయక ప్రాణిని మాటల్లో చెప్పలేని హింసతో హతమార్చిన కేసులో ఇద్దరు మహిళలను కోర్టు జైల్లోకి నెట్టింది. మనిషులెవరూ ఇంతటి ఘోరానికి పాల్పడరని, వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇంగ్లాండులోని కార్ల్‌ఐజల్ కోర్టు మంగళవారం ఈ తీర్పువెలువరించింది.

ట్రేసి డిక్సన్(47), నికోలా బ్రాడ్లే(35) అనే మహిళలు గత ఏడాది జూలైలో ఓ పెంపుడు చిలకను చంపేశారు. మద్యం మైకంలో పిచ్చెత్తి అమానుషానికి పాల్పడ్డారు. తమ స్నేహితుడు, మాజీ సైనికుడు అయిన పాల్ క్రూక్స్ దగ్గరున్న స్పార్కీ అనే ‘ఆఫ్రికన్ గ్రే’ జాతి చిలుకను యమదూతల్లా హింసించారు. క్రూక్స్ ఇంటికి వెళ్లి అతుడు నిద్రపోతుండగా చిలుకపై ఓవెన్ క్లీనర్ స్ప్రే చేశారు. అంతటితో ఊరుకోకుండా గ్లాస్ పెయింట్‌లో ముంచిలేపారు. మెడ విరిచి, వాషింగ్ మిషన్‌లో పడేశారు. దాన్ని పెంపుడు కుక్కకు తినిపించడానికి ప్రయత్నించారు. నిద్ర లేచిన క్రూక్స్ జరిగిన ఘోరం చూసి విలవిల్లాడుతూ కేసు పెట్టాడు. స్పార్కీ ఇంగ్లండ్ జాతీయ గీతంతో ఎన్నో పాటలు పాడుతూ ముద్దుముద్దుగా మాట్లాడేదని క్రూక్స్ చెప్పాడు. విచారణంలో ట్రేసీ, నికోలా ఒకరిమీద ఒకరు తప్పు నీదంటే నీదని ఆరోపించుకున్నారు. కేసును విచారించిన కోర్టు ఇద్దరికీ 25 నెలల జైలు శిక్ష వేయడంతో పాటు వారు బతికి ఉన్నంతవరకు ఏ జంతువునూ, పక్షినీ పెంచుకోకూదని ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News