ఆత్మలున్నాయి.. మరణం తర్వాత మరో ప్రపంచం : అమెరికా డాక్టర్
మనిషి మరణించిన తర్వాత ఏమవుతుంది. అసలు ఆత్మలున్నాయా.. మనిషికి మరో జన్మ ఉంటుందా.. మరణం తర్వాత మరో ప్రపంచం ఉంటుందా.. అంటే ఓ అమెరికా డాక్టర్ అవుననే అంటున్నాడు. అమెరికాకు చెందిన రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. జెఫ్రీ లాంగ్ సంచలన విషయాలు చెప్పారు. ఆత్మలు ఉన్నాయని.. మరణం తర్వాత మరో జీవితం కూడా ఉంటుందని తెలిపాడు.
డాక్టర్ జెఫ్రీ లాంగ్.. మరణం తరువాత మనుషులకు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆయన 1998లోనే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్ షౌండేషన్ స్థాపించారు. ఈ క్రమంలో మరణం అంచులదాకా వెళ్లిన 5 వేల మందిపై అధ్యయనం చేశారు. గుండె ఆగిపోవడం లేదా కోమాలో ఉన్న వారు అనుభవించే స్థితినే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటారని డా. జెఫ్రీ వివరించారు. మరణం అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన ఇలాంటి వారిలో కొందరు తమ శరీరం పనిచేయకపోయినా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగారని, ఏం జరుగుతోందో వినగాలిగారని చెప్పారు.
ఇలాంటి వారి అనుభవాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత ఆత్మ ఉనికిని, మరణం తరువాత మరో ప్రపంచాన్ని గుర్తించినట్లు డాక్టర్ జెఫ్రీ తెలిపారు. ‘‘ఈ అధ్యయనంలో తనకు ఎన్నో ఆధారాలు లభించాయని.. మరణం తరువాత మరో ప్రపంచం ఖచ్చితంగా ఉందని తాను బలంగా నమ్ముతున్నట్లు వివరించాడు. నియర్ డెత్ అనుభవం ఎదుర్కొన్న వారిలో దాదాపు 45 శాతం మంది తమ ఆత్మ శరీరం నుంచి వేరైన విషయాన్ని గుర్తించినట్లు డాక్టర్ చెప్పారు.
కొంతమంది శరీరం నుంచి బయటకు వచ్చిన ఆత్మ అక్కడే కాసేపు తిరిగిందని.. దీంతో వారు అక్కడ జరుగుతున్న అన్ని విషయాలను ప్రత్యక్షంగా చూస్తూ వినగలిగారు. మరికొందరు మాత్రం తమ ఆత్మ ఓ సొరంగంలోంచి ప్రయాణిస్తూ ఓ వెలుతురు వైపు పయనించినట్టు చెప్పారు. గతంలో మరణించిన తమ బంధువులు, స్నేహితులను కలుసుకున్నట్టు తెలిపారు. తమ జీవితం మొత్తం క్షణకాలం పాటు తమ కళ్లముందు కదిలినట్టు వివరించారు’’ అని డాక్టర్ జఫ్రీ తెలిపారు. ఇలాంటి అనుభవాల్ని శాస్త్రీయంగా వివరించే ఆధారలేవీ దొరకలేదన్న ఆయన ఆత్మలు, మరణం తరువాత జీవితం మాత్రం నిజమని స్పష్టం చేశాడు.