ప్రిగోజిన్‌ను అలా చంపారు.. అమెరికా రక్షణ విభాగం చెప్పింది ఇదీ..

Update: 2023-08-25 11:16 GMT

రష్యా కిరాయి సైనినిక ముఠా ‘వాగ్నర్’ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా పేల్చి వేశారని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ చెబుతోంది. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌పై తిరగబడిన ప్రిగోజిన్‌ను ఇలాంటి ఘటనలో చనిపోవడం ఆశ్చర్యకరమేం కాదని రక్షణరంగ నిపుణులూ చెబుతున్నారు. ‘‘రష్యా సైనికులు క్షిపణి ప్రయోగంతో విమానాన్ని కూల్చేశారని చెప్పలేం. విమానం లోపలే బాంబును ఉంచి పేల్చేసి ఉండొచ్చు’’ అని పెంటన్ ప్రతినిధి పాట్ రైడర్ చెప్పారు. మరోపక్క.. ప్రిగోజిన్‌ది ప్రమాదం కాదని హత్యేనని వాగ్నర్ గ్రూపు ఆరోపిస్తోంది. వాగ్నర్‌ గ్రూపు అగ్ర నాయకులు ఒకే విమానంలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు ఎందుకు వెళ్తున్నారన్నదానిపైనా స్పష్టం రావడం లేదు. ప్రమాద సమయంలో బాంబు పేలుళ్లు జరిగినట్లు భారీ శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాగ్నర్ నేతలు ప్రయాణించిన ఎంబ్రాయర్ లెగసీ 600 విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్యా లేదని దాన్ని తయారుచేసిన బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయర్ స్పష్టం చేసింది. గత రెండు దశాబ్దాల్లో ఎంబ్రాయర్ విమానం ప్రమాదానికి గురికావడం ఇది రెండవసారి మాత్రమేనని వెల్లడించింది. ప్రిగోజిన్ ముఠాతో మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న విమానం త్వెర్ ప్రాంతంలో బుధవారం కుప్పకూలింది.

రష్యా సైన్యం తరఫున ఉక్రెయిన్‌లో పోరాడుతున్న తమకు పుతిన్ సహకారం అందించడం లేదంటూ ప్రిగోజిన్ ఈ ఏడాది జూన్‌లో తిరుగుబాటు చేయడం తెలిసిందే. రెండు సరిహద్దు పట్టణాలను సైతం తన అధీనంలోకి తెచ్చుకున్న ఆయన బెలారస్ మధ్యవర్తిత్వంతో వెనక్కి తగ్గాడు. రూ. 8 వేల కోట్ల విలువైన సైనిక కాంట్రాక్టులను వాగ్నార్ గ్రూపుకు కట్టబెట్టడానికి పుతిన్ అంగీకరించారు. అంతా సద్దుమణిగిన నేపథ్యంలో ప్రిగోజన్ అనూహ్యంగా ప్రమాదంలో చనిపోయారు. ప్రిగోజిన్ వాగ్నర్ సైనిక ముఠా పగ్గాలను అతని తర్వాతి స్థానంలో ఉన్న ఆంద్రీ త్రోషేవ్, అలెగ్జాండర్ కుజెనత్సోవ్‌లో ఒకరికి దక్కొచ్చని భావిస్తున్నారు. వీరు పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో ఎన్నో కిరాయి సైనిక ఆపరేషన్లలో సత్తా చాటారు.


Tags:    

Similar News