Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి

Byline :  Veerendra Prasad
Update: 2024-01-16 05:54 GMT

భారతీయ- అమెరికన్, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయాలని భావించిన రామస్వామి అందుకోసం ప్రచారం సైతం మొదలుపెట్టారు. కానీ ఆశించిన స్థాయిలో మద్దతు రాకపోవడంతో వెనక్కి తగ్గారు. డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి తాను మద్దతు పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా కాకసస్ (Iowa caucuses)లో తొలిపోరు జరిగింది. దీనిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి విజయాన్ని అందుకున్నారు. 51 శాతం ఓటింగ్‌తో ట్రంప్ తొలి విజయం సాధించగా.. వివేక్(Vivek Ramaswamy) పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయనకు కేవలం 7.7 శాతం ఓటింగే వచ్చింది. ట్రంప్ తర్వాత రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది. ఇక, నాలుగో స్థానంలో నిలిచిన వివేక్‌ రామస్వామి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో అధ్యక్ష పదవి రేసులో ట్రంప్‌కు ఆయన మద్దతు పలకాల్సి వచ్చింది.

దక్షిణ భారతదేశం నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులకు ఓహియోలో రామస్వామి జన్మించారు. 38 ఏళ్ల ఈ మల్టీ మిలియనీర్.. 2024 రిపబ్లికన్ అభ్యర్థి రేసులోకి దూసుకొచ్చారు. ఇమ్మిగ్రేషన్‌, అమెరికాకే తొలి ప్రాధాన్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించి, అందరి దృష్టిని ఆకర్షించారు. మొదటి నుంచి ట్రంప్‌ విధానాలకే మద్దతు ఇస్తున్న ఆయన.. ప్రచారంలో కూడా మాజీ అధ్యక్షుడి శైలినే అనుకరించారు. ఆ తర్వాత ప్రచారంలో వైవిధ్యతను కనబరుస్తూ వచ్చినప్పటికీ.. ప్రచార చివరిరోజుల్లో ట్రంప్‌, రామస్వామిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు..అయోవా కాకసస్ ఎన్నికల్లో చేదు ఫలితం అందుకుని అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వివేక్‌ రామస్వామి తప్పుకున్నారు. 




Tags:    

Similar News