నీలిరంగు బుల్లిపిట్ట గొంతు పిసికి ఎక్స్ (X) గుర్తును పట్టుకొచ్చిన మస్క్ మామ యూజర్లకు అగ్నిపరీక్షలు పెడుతున్నాడు. ట్విటర్ (twitter) ఎక్స్‌గా మారిన నేపథ్యంలో అక్కడే చేసే పోస్టులు ఏ పేరుతో పిలవాలో అర్థం కావట్లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. ‘‘ట్విటర్ కంపెనీ ఇప్పుడు లేదు. అలాంటప్పడు ట్వీట్(tweet) చేశారు అనడం సరికాదు. ట్విటర్ ఎక్స్‌గా మారింది కాబట్టి ఎక్స్ చేశారు(Xed) అనాలి’’ అని చర్చ ఎక్సరాటీల్లో మొదటైంది. అయితే ట్విటర్ పేరు మారినా వెబ్ సైట్ పేరు ఇంకా twitter.com అనే ఉండడం గమనార్హం.
ఇలా పిలిస్తే పోలా..
ట్విటర్ పేరుతో నడిచిన కాలంలో పోస్టులోని అక్షరాలకు పరిమితి ఉండేది. పిట్ట కూసినట్లు క్లుప్తంగా ఉండాలనే ఉద్దేశంతో లోగోలోనూ పిట్టను పెట్టారు. ఇప్పుడు పరిమితే కాదు, పిట్టే లేచిపోవడంతో ట్వీట్ అనే పదం కూడా కాలగర్భంలో కలిసిపోయినట్లే. ఇప్పుడు రెండే క్రాస్ గీతలు మిగిలాయి.అందుకే ఎవరైనా ఎక్స్‌లో పోస్ట్ పెడితే జీట్ చేశారు, జీట్స్ చేశారు (Xeets) అని పిలవడం బావుంటుందని కొందరు సూచిస్తున్నారు. కొందరైతే ‘ఎక్సర్‌ప్ట్స్(Xcerpts) అనాలని అంటున్నారు. మరీ ఇంత కష్టంగా ఉండక్కర్లేదని ఎక్స్‌డ్ అంటే బావుంటుంది కదా అని మరికొందరి ప్రతిపాదన. అవన్నీ చెత్తగా ఉన్నాయని, ట్వీట్ అనేదే క్యాచీగా ఉంటుంది, ఎక్స్ తీసేసే మళ్లీ ట్విటర్ పేరు పునరుద్ధరించాలని మరికొందరు చెబుతున్నాయి.
ఎందుకబ్బా..
ట్విటర్‌ను సూపర్ ఫ్లాట్‌ఫామ్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే ఎక్స్‌గా మార్చినట్లు మస్క్ చెబుతున్నారు. ఎక్స్‌లో ఆర్థిక లావాదేవీలు, వ్యాపార కమ్యూనికేషన్ వంటి ఫీచర్లను కూడా పరిచయం చేసినట్లు చెప్పాడు. ఎక్స్ సంగతి ఎలా ఉన్నా ఎక్స్ పేరుతో ఉంటే అశ్లీల వెబ్ సైట్లకు మాత్రం మస్క్ మామ పుణ్యమా అని భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఎక్స్ అని కొడితే చాలు పచ్చి శృంగార సైట్లు దర్శనం ఇవ్వడంతో కొంత తంటా మొదటైంది. చాలా అశ్లీల సైట్లు ఎక్స్‌తోనే మొదలవుతుంటాయి. ఎక్స్, డబుల్ ఎక్స్ వంటి గోలలో మస్క్ ట్విటర్ ఇరుక్కుపోయింది. మస్క్ ట్వటర్‌ను కొన్నాక ఆ కంపెనీ వేలకోట్ల నష్టాన్ని చవిచూసింది. ఎక్స్‌గా మారాక నెలవారీ యూజర్ల విషయంలో సరికొత్త రికార్డును సాధించామని మస్క్ చెప్పాడు. నెలవారీ వినియోగదారులు 54 కోట్ల దాటారని అంటున్నాడు.