లండన్‌లో ఎకరా 15 కోట్లు... కోకాపేటలో 100 కోట్లు.. ఎందుకింత డిమాండ్?
కోకాపేట భూములు తెలంగాణ ప్రభుత్వానికి కనకవర్షం కురిపిస్తున్నాయి. అమ్మకానికి అందుబాటులో ఉన్న భూములు తక్కువ ఉండబట్టి సరిపోయిందిగాని లేకపోతే మొత్తం అమ్మేస్తే రాష్ట్రం అప్పులే కాదు, దేశం అప్పులు కూడా తీర్చేసి.. ఏళ్లపాటు కాలుమీద కాలు వేసుకుని కూర్చునే పరిస్థితి. గురువారం జరిగిన కోకాపేట నియోపొలీస్ భూములు వేలంలో ఎకరా రూ. 100.75 కోట్లకు పలికి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. దాదాపు 45 ఎకరాల భూమికి రూ. 1300 కోట్లు వస్తుందని ప్రాథమికంగా అంచనా వేయంగా రెట్టింపుకన్నా ఎక్కువగా రూ. 3119 కోట్లు వచ్చాయి. ఈ స్థాయిలో భూములు అమ్ముడుబోవడం దేశ చరిత్రలో రికార్డ్ అంటున్నారు. రెండుమూడు దశాబ్దాల కిందట ఒక ఎకరం 10 లక్షలు కూడా పలకని భూములకు ఇప్పుడెందుకు ఇంత ధర? జూబిలీ హిల్స్, బంజారాహిల్స్ వంటి చోట్ల కూడా లేనంత ధర కోకాపేటలో ఎందుకుంది? అంతర్జాతీయ నగరం లండన్ శివారులో ఎకరా భూమి రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్లకే లభిస్తుంటే హైదరాబాద్‌లో అంతకు పదింతల ధర ఎందుకు పలుకుతోంది?
ఇంటర్నేషనల్ హబ్..
హైదరాబాద్ నగరానికి పడమటివైపున్న కోకాపేట వ్యాపారం, రవాణా, నివాసం వంటి అన్ని అవసరాలకు అనుకూలం. పక్కనే ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద ప్లస్ పాయింట్. చుట్టుపక్కల వందలాది ఐటీ కంపెనీలు కోకాపేట్ నియోపోలీస్ లే అవుట్ చుట్టూనే ఉన్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే మెట్రో రైలు మార్గం నియోపోలిస్ పక్కనుంచే వెళ్తుంది. జాబ్, జర్నీ, జాయ్.. మూడు కీలక సదుపాయాలకు ఇది కేరాఫ్ అడ్రస్. కొన్నేళ్లుగా ఊపందుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఈ భూములు అనూహ్యమైన ధరకు అమ్ముడుబోతున్నాయి.
నో రిస్ట్రిక్షన్స్..
కోకాపేటను ఇంటర్నేషనల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల విషయంలో సడలింపు ఇవ్వడం మరో సానుకూల అంశం. కోకాపేటలో జీహెచ్ఎంసీ అమ్ముతున్న స్థలాల్లో భవన నిర్మాణాకు సంబంధించి ఇన్ని అంతస్తులే కట్టాలన్న పరిమితి లేదు. కొనుక్కున్న భూమిని నివాసానికి, వ్యాపారానికి, మరే అవసరానికైనా వాడుకోవచ్చు. దీంతో ప్రముఖ వ్యాపార, రియల్ ఎస్టేట్ కంపెనీలనీ కోకాపేటపై కన్నేశాయి. కూతవేటు దూరంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సొసైటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
నియోపోలిస్ హైలైట్స్..
• నియోపోలిస్ లేఅవుట్‌ను జీహెచ్ఎంసీ రూ.300 కోట్లతో అభివృద్ధి చేసింది. అత్యాధిక సదుపాయాలు కల్పించింది. విశాలమైన రహదారులు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సదుపాయం, సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు ఉన్నాయి. ఇన్నర్ రోడ్ల పొడవు 45 మీటర్ల వరకు ఉంటుంది. అన్నిటికీ మించి ఎలాంటి వివాదం లేదని క్లియల్ టైటిల్ ఉంది.
• నియోపోలిస్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుకు రెండే నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు అన్న ఐదు నుంచి 20 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉన్నాయి.
• ఎకరా రూ. 100 కోట్లు పలికిన 10వ నంబర్ ప్లాట్‌లోని 3.60 ఎకరాల భూమి మిగతా భూములకన్నా ఎత్తులో ఉంది. దీన్నుంచి వ్యూ కనువిందుగా ఉంటుంది. ప్లాట్ వెనక వైపు గండిపేట చెరువు, ముందు నుంచి హైదరాబాద్ నగరం వ్యూ స్పష్టంగా కనిపిస్తుంది. హ్యాపీ హైట్స్ నియోపొలిస్, రాజపుష్ప ప్రాపర్టీస్ కలసి కొన్నాయి.
భవిష్యత్‌లో
కోకాపేట భూములకు భవిష్యత్తులో ధరలు భారీగా పెరుగనున్నాయి. మెట్రో పూర్తయి, మరిన్ని జాతీయ, అంతర్జతీయ కంపెనీలు ఇప్పుడు వందల కోట్లు పలికే భూములు వేల కోట్లకు చేరుకుంటాయి. కంపెనీలు తమ భవిష్యత్ అవసరాల కోసం ముందే కొనిపెట్టుకుంటున్నాయి. కొన్ని ప్లాట్లను ఇప్పటికిప్పుడు ఆవాసాలుగా మార్చితే పెట్టుబడికి రెండుమూడింతల లాభం వస్తుంది. ఐటీకి, ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో మరెక్కడా ఇంతటి సదుపాయాలున్న భూములు అందుబాటులో లేకపోవడంతో కోకాపేట కేక పుట్టిస్తోంది.