Viral News : 61 ఏళ్లు కడుపులో బిడ్డను మోసిన తల్లి.. పేదరికంతో ఎంత కష్టం!
61 ఏళ్ల కడుపులో బిడ్డను మోసిన తల్లి రాయిలా మారిపోయిన బేబి ప్రపంచంలో మనకు తెలియని వింతలుఎన్నో జరుగుతుంటాయి. అవెలా అయ్యాయో ఎవరూ కనుక్కోలేరు కూడా. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే. వైద్యులనే ఆశ్చర్యపోయేలా చేసిన ఈ వింత సంఘటన చైనాలో జరిగింది.
చైనాకు చెందిన హువాంగ్ యిజున్ 31 ఏళ్ల వయసులో అందరిలాగే గర్భం దాల్చింది. అయితే ఆమె కడుపులో ఉన్న బిడ్డ గర్భాశయం లోపల కాకుండా బయట పెరిగింది. సాధారణంగా ఇలాంటి పిల్లలు ప్రాణాలతో పుట్టరు. ఈ పరిస్థితి తల్లికి కూడా ప్రమాదకరం. హువాంగ్‌కు డాక్టర్లు కూడా ఇదే చెప్పారు. వెంటనే అబార్షన్ చేయాలని కూడా చెప్పారుట. పిండం ఎదగదని కూడా చెప్పారుట. కానీ హువాంగ్ దగ్గర డబ్బులు లేకపోవడం వలన అబార్షన్ చేయించుకోలేదు. ఏదైతే అదే అవుతుందని దాన్ని అలానే ఉంచేసుకుంది. అలా 61 ఏళ్ల పాటూ కడుపుతోనే ఉంది హువాంగ్.
అయితే విచిత్రం ఏంటంటే సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో గర్భవిచ్ఛిత్తి అయిపోతుంది. లేదా తల్లికి బ్లీడింగ్ అవ్వడం, విపరీతమైన కడుపునొప్పి రావడం లాంటివి జరుగుతాయి. కానీ హువాంగ్‌కు అలాంటివేమీ జరగలేదు. కడుపు పెరిగి అలానే ఉండిపోయింది కానీ ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చివరకు 92 ఏళ్ల వయసులో మళ్లీ డాక్టర్‌ను సంప్రదించింది హువాంగ్. ఆమెను చూసిన డాక్టర్లు అవాక్కయ్యారు. ఆమె చెబుతున్నది నిజం కాదేమో అనుకున్నారు. కానీ టెస్ట్‌లు చేసి చూస్తే హువాంగ్ చెప్పింది నిజమేనని తేలింది. దాంతో వాళ్లకు నోటమాట రాలేదు. అసలు ఇదెలా సాధ్యమైందన్న విషయం డాక్టర్లకు అంతుబట్టలేదు. అయితే ఆమె కడుపులో బిడ్డ మాత్రం చనిపోయి...రాయిలా మారిపోయింది. అంతే అంతకుమించి..ఇన్ఫెక్షన్లు రావడం కానీ, శరీరంలో ఇంకే మార్పూ జరగలేదు.
92 ఏళ్ల వయసులో హువాంగ్‌కు డాక్టర్లు ఆపరేషన్ చేసిన స్టోన్ బేబీని బయటకు తీశారు. వైద్య చరిత్రలోనే ఇది అత్యంత వింతైన కేసు. ఇలాంటి అస్సలు జరగవు. అందుకే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పేదరికం ఏ దేశంలో అయినా ఎంతటి దారుణాలకు, వింతలకు దారి తీస్తుందో ఈ కథ చెబుతోంది.