మొసలి నోట్లో చిక్కితే అంతేసంగతులు. అల అంతటి గజేంద్రుడినే మొసలి నుంచి రక్షించడానికి పనిగట్టుకుని సాక్షాత్తు విష్ణుమూర్తే రావాల్సి వచ్చింది. అలాంటి క్రొకడైల్ బారి నుంచి తప్పించుకుంది ఓ మహిళ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వామ్మో అనిపించుకుంటోంది.
ఇండోనేషియాలోని ఫమిర్లా డీ జీసస్ అనే ఆమె పామ్ ఆయిల్ తోటల్లో పనిచేస్తుంటుంది. నీళ్ళ కోసం తోట పక్కనే ఉన్న నది దగ్గరకు వెళ్ళింది. అందులో మొసలి ఉన్న సంగతి ఆమెకు తెలియదు. నీళ్ళు మొత్తం నాచు మొక్కలతో నిండిపోయి ఉండడం వలన అది కనిపించలేదు కూడా. కానీ నీళ్ళు తీసుకుందామని నీళ్ళల్లోకి దిగేసరికల్లా ఆమె మీద దాడి చేసింది మొసలి. కాళ్ళను పట్టుకుని నీళ్ళల్లోకి లాక్కెళ్ళిపోయింది.
సాధారణంగా ఒకసారి మొసలికి చిక్కితే కాపాడ్డం ఎవ్వరి తరమూ కాదు. కానీ ఫమిర్లాకు భూమి మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆమెను మొసలి తీసుకెళ్ళడం గమనించిన కూలీలు వెంటనే పరుగెత్తుకు వచ్చారు. కర్రలతో కొట్టి విడిపించడానికి ప్రయత్నం చేశారు. ఫమిర్లా కూడా చాలా గట్టిగా పోరాడింది. మొసలి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది. అలా గంటపాటూ వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించి బాధితురాలిని విడిచిపెట్టింది మొసలి.
ప్రాణాలతో బతికిబట్టకట్టింది కానీ ఫమిర్లాకు చాలా తీవ్రగాయాలే అయ్యాయి. పాదాలు, కడుపు దగ్గర భాగాలు బాగా దెబ్బ తిన్నాయి. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన వారికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఫమిర్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తాను మొసలి బారి నుంచి బయటపడతానని అనుకోలేదని...ఇప్పటికీ తాను దాని నోట్లోనే ఉన్నట్లు ఉన్నాదని చెబుతోంది పాపం.