Canada Vs India : కెనడాలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య.. తామే చంపేశామన్న బిష్ణోయ్

Byline :  Mic Tv Desk
Update: 2023-09-21 10:50 GMT

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడా దేశాల మధ్య పెట్టిన చిచ్చు చల్లారకముందే మరో సిక్కు ఉగ్రవాది హతమయ్యాడు. గ్యాంగ్‌స్టర్, ఖలిస్తాన్ వేర్పాటువాది సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖా ఖాన్ దునుకేను బుధవారం కెనడాలోని విన్నిపెగ్ ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. దీనిపై భారత్‌లోని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన చేశారు. దునుకేను తాము హతమార్చామని, భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని జరుగుతాయని హెచ్చరించాడు. ఫేస్‌బుక్‌లో దీనిపై బిష్ణోయ్ గ్యాంగ్ ఓ పోస్ట్ పెట్టింది. దనుకా ఎంతోమంది జీవితాలు నాశనం చేసి తగిన శిక్ష అనుభవించాడని తెలిపింది.

గురులాల్ బ్రార్, విక్కీ మిదిఖేరాల హత్యల్లో దునుకే కీలక పాత్ర పోషించాడని, విదేశాల నుంచి కుట్రలు అమలు చేయించాడని బిష్ణోయ్ గ్యాంగ్ ఆరోపించింది. ‘‘సందీప్ నంగల్ అందియా అనే మరో గ్యాంగ్‌స్టర్‌ను కూడా దనుకే చంపేశాడు.. అతడు మత్తుపదార్థాలకు బానిస. ఆ ముఠా ప్రపంచంలో ఎక్కడున్నా వెంటాడి మట్టుబెడతాం. వాళ్లిక ప్రశాంతంగా బతకడం అసాధ్యం’’ అని బిష్ణోయ్ ముఠా హెచ్చరించింది. పంజాబ్‌లోని మోగా చెందిన దనుకే ప్రముఖ ఖలిస్తాన్ ఉగ్రవాద నేత ఆర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దల్లాకు ప్రధాన అనుచరుడు. 2017లో నకిలీ పాస్ పోర్టులో కెనడాకు వెళ్లాడు. అతనిపై ఏడు క్రిమినల్ కేసులున్నా కెనడాలోని సిక్కుల సాయంతో పాస్ పోర్ట్ ఇతర అనుమతి పత్రాలు పొందాడు. కాగా, లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం అహ్మదాబాద్ జైల్లో ఉన్నాడు. కాంగ్రెస్ నేత, గాయకుడు సిద్దూ మూసేవాలాను లారెన్స్ చంపాడని కేసు నమోదైంది.


Tags:    

Similar News