అకుంఠిత దీక్షతో సాకారమైన తెలంగాణ తొమ్మది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. తొమ్మిదేళ్ల ప్రస్థానంలో బాలారిష్టాలను ఎదుర్కొంటూ రాష్ట్రం అన్ని రంగాల్లో తనదైన అభివృద్ధి ముద్ర చూపింది. వ్యవసాయంతో పాటు ఇతర మౌలిక రంగాలను బలోపేతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైద్య, ప్రజారోగ్య రంగాల్లోనూ గణనీయ ప్రగతి సాధించింది. ఆరోగ్య సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయడంతో పాటు కేసీఆర్ కిట్, కంటి వెలుగు, బస్తీ దవాఖానాలు వంటి వినూత్న పథకాలతో ప్రజారోగ్య వ్యవస్థను బలపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది.
నంబర్ వన్
వైద్యారోగ్యాల చరిత్రను తెలంగాణ ప్రభుత్వం తిరగరాసింది. రూ. 3,532 తలసరి వైద్య వ్యయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణంలోనూ ముందంజలో ఉంది. దేశంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో అగ్రస్థానంలో ఉంది. మెడికల్ పీజీ సీట్లలోనూ రాష్ట్రానిది రెండో స్థానం. కోవిడ్ నియంత్రణకు దేశంలోనే తొలిసారిగా లాక్ డౌన్ విధించి ప్రజల ప్రాణాలను కాపాడింది.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యం..
మాతాశిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, 102 అమ్మఒడి వాహన సదుపాయం కల్పిస్తోంది. ఇలాంటి మరెన్నో సదుపాయాలు వల్ల రాష్ట్రంలో మాతాశిశు మరణాలు గణనీయంగా తెగ్గి, ఆస్పత్రుల్లో ప్రసవాలు వెరిగాయి. కేసీఆర్ కిట్ కింద ఆడపిల్ల పుడితే 13, మగపిల్లాడు పుడితే 12 వేలు ఇస్తూ టీకా నిబంధనలు అమలు చేయడంతో ఇమ్యునైజేసన్ లక్ష్యం నెరవేరుతోంది.
మౌలిక సదుపాయాలు, విస్తరణ..
రాష్ట్రభుత్వం జిల్లాకొక మెడికల్ కాలేజీ లక్ష్యం 21 మెడికల్ కాలేజీలను స్థాపించింది. పాతవాటితో కలిపి రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గాంధీ, ఉస్మానియ వంటి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండేవి. 6 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంలో భాగంగా ఇప్పటి నాలుగు నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వాస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూరుస్తోంది. బస్తీ దవాఖానాలను నెలకొల్పి వైద్యసేవలన ఇంటి దగ్గరికే తీసుకొచ్చింది. కంటి వెలుగు పథకం కింద తొలి దశలో కోటిన్నర మందికి, రెండో దశలో ఇప్పటికి వరకు కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేసింది. జిల్లా కేంద్రాల్లో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి సామాన్యు వెతలను కొంతవరకు తీర్చింది. రాష్ట్రం ఏర్పడిన 2014తో పోలిస్తే నేటి తెలంగాణ వైద్య, ప్రజారోగ్య రంగాల్లో సాధించిన పురోగతి ప్రశంసనీయమే.
ఎంత ప్రగతి సాధించినా ప్రభుత్వాస్పత్రులో ఇప్పటికే ఎన్నో సమస్యలు మేటవేసి ఉన్నాయి. హైదారాబాద్, వరంగల్ వంటి నగరాల్లో సేవలు కాస్త బావున్నా జిల్లా కేంద్రాల్లోనూ పల్లెల్లోనూ ఆశించిన స్థాయిలో సదుపాయాలు మెరుగుపడ్డం లేదు. ప్రజలు ఇప్పటికే అప్పోసప్పో చేసి చిన్నపాటి చికిత్సలకు కూడా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తుండడం దీనికి ఉదాహరణ.