కోట్లాది మంది ప్రజలు కొట్లాడి సాధించిన ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ. నీళ్లు, నిధులు, నియామకాలు, మా పాలన మాకేనని ఉద్యమాలు చేపట్టి అమరవీరులు అందించిన బంగారు రాష్ట్రం తెలంగాణ. సకల జనుల సమ్మెలు, మిలియన్ మార్చులు, సహాయ నిరాకరణలు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ ఆకాంక్షను కేంద్రానికి వెలుగెత్తి చాటి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ తెచ్చుడో..కేసీఆర్ సచ్చుడో...అంటూ ఆమరణ దీక్ష చేపట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఒకప్పుడు విద్యుత్ కొరత, నీటి సమస్య, నిరుద్యోగంతో అల్లాడిపోయిన రాష్ట్రం నేడు పెట్టుబడులకు కేరాఫ్‌గా మారింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తెలంగాణ ఈ జూన్ 2తో పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఇంతటి ప్రగతిని సాధించడానికి కర్త, కర్మ, క్రియ అంతా సీఎం కేసీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పడానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలే అందుకు సజీవ సాక్ష్యాలు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో దూసుకెళ్తోంది. లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు పైకి లేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల కన్నీరు తుడిచారు సీఎం కేసీఆర్. యాదాద్రి పునరుద్ధరణతో భక్తుల కోరిక తీర్చారు. కనీవినీ ఎరుగని రీతిలో సచివాలయం నిర్మాణం చేపట్టారు. భారీ అబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. భద్రతకు నిలువుటద్దంలా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అధికారుల సౌకర్యార్థం కలెక్టరేట్లను నిర్మించారు. రైతు వేదికలు, కళాశాలలు, దవాఖానాలు, రహదారులు, ఎత్తైన భవనాలు, నగరాల సుందరీకరణ కోసం ఎన్నో అద్భుతమైన కట్టడాలను చేపట్టారు. ఒకప్పుడు చీకటి గుహల్లా, భూత్ బంగ్లాల్లా ఉన్న ప్రభుత కార్యాలయాలు నేడు అత్యాధునిక హంగులతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కార్పొరేట్ లెవెల్లో వెలుగు దివిటీలై రాష్ట్ర కీర్తిని ప్రపంచమంతటా చాటుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటుతున్న అద్భుతమైన నిర్మాణాల వైభవాన్ని చూసేద్దాం పదండి.
తిరుపతిని తలపించేలా యాదాద్రి నిర్మాణం :
యాదాద్రిపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునరుద్ధరణతో నవ వైకుంఠాన్ని చూడాలన్న తన కోరిక నెరవేర్చారు కేసీఆర్. పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం. దేవస్థానంలో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగితేలుతారు. ఆలయంలోకి అడుగులు వేయగానే కొండపైవున్న సప్త గోపురాలు వైకుంఠానికి వెళ్లామా అన్నట్లు అనుభూతిని కలిగిస్తుంది. రూ.270 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ప్రతిష్టాత్మక నిర్మాణం సచివాలయం, అంబేద్కర్ విగ్రహం :
కాకతీయ ఆర్కిటెక్చర్‌కు ఇండో–పర్షియన్–అరేబియన్ శైలిని జోడించి సకల సౌకర్యాలతో డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయానికి రూపకల్పన చేశారు కేసీఆర్. హైదరాబాద్ నడిబొడ్డులో సాగర తీరాన పార్లమెంట్ తరహాలో నిర్మించిన సెక్రటేరియేట్‌కు ఎన్నో ప్రత్యేకతలు , మరెన్నో విశేషాలు ఉన్నాయి. రూ.600 కోట్ల బడ్జెట్‌తో 28 ఎకరాల విస్తీర్ణంలో 7 అంతస్తుల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ కట్టడాన్ని నిర్మించారు. అదే విధంగా హుస్సేన్ సాగర్ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించారు. 125 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ విగ్రహాన్ని 791 టన్నుల స్టీల్‌తో , 96 మెట్రిక్ టన్నుల ఇత్తడితో తయారు చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద అమరవీరుల స్తూపం :
అవమానించిన చోటనే కనీవిని ఎరుగని రీతిలో ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా భారీ అమరవీరుల స్తూపాన్ని నెలకొల్పి వారి గౌరవాన్ని నిలబెట్టారు కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెల్లో అమరవీరుల త్యాగాలు నిత్యం జ్వలించాలన్న ఉద్దేశంతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. రూ.177.50 కోట్ల వ్యయంతో భాగ్యనగరంలోని ట్యాంక్ బండ్ వద్ద 3.29 ఎకరాల విస్తీర్ణంలో స్టెయిన్ లెస్ స్టీల్‌తో దీపం ఆకారంలో ఈ స్తూపాన్ని స్థాపించారు.
ప్రజా రక్షణగా కమాండ్ కంట్రోల్ సెంటర్ :
2015 సంవత్సరంలో నవంబర్ 22న పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రభుత్వం నిర్మించింది. రూ. 600 కోట్ల బడ్జట్‌తో 6.42 లక్షల చ.అ.ల విస్తీర్ణంలో 83.5మీటర్ల ఎత్తులో ఈ భవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ నిర్మించారు. ఈ సెంటర్‌ను నిర్మించేందుకు సుమారు ఆరేళ్ల సమయం పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు, ఉన్నతాధికారుల వరకు పూర్తి ప్రభుత్వ యంత్రాంగం ఈ సెటంర్ నుంచి పర్యవేక్షించేవిధంగా నిర్మాణాన్ని చేపట్టారు. విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడమే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యం.
కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ :
ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ కాళేశ్వరం మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ . ఈ ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక. కేసీఆర్ స్వయంగా పరిశీలించి, అధ్యయం చేసి ఆయన సంకల్పంతో భవిష్యత్తులో చెక్కుచెదరని రీతిలో ఈ ప్రాజెక్టును నెలకొల్పారు. రాష్ట్ర సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు తీర్చడంలో ఈ ప్రాజెక్టు కీలక భూమిక పోశిస్తోంది. లక్ష కోట్ల బడ్జెట్‌తో లక్షలాది ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిస్తూ లక్షలాది మంది రైతుల కళ్లల్లో వెలుగులను నింపింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 20 జిల్లాలకు లబ్ధి చేకూరుతోంది .
ప్రపంచంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ :
నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో దుర్గం చెరువుపైన నిర్మించిన కట్టడం కేబుల్ బ్రిడ్జ్. ఈ కేబుల్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా పేరు సంపాదించుకుంది. హైదరాబాద్ పేరును ప్రపంచ పటంలో నిలిపింది.
రూ. 184 కోట్ల వ్యయంతో , 754 మీటర్ల పొడవులో రాష్ట్ర సర్కార్ ఈ నిర్మాణాన్ని చేపట్టింది.
దళితులకు ప్రత్యేక స్టడీ సెంటర్ :
దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా దళితుల కోసం ప్రత్యేకంగా దళిత్ స్టడీ సెంటర్‌ను నిర్మించింది సర్కార్. దళితుల సామాజిక జీవనానికి సంబంధించి అధ్యయనాలను, పరిశోధనలను చేసేందుకు వీలుగా భవనాన్ని స్థాపించారు.రూ. 25 కోట్ల నిధులతో 67 వేల చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో 6 అంతస్తుల్లో ఈ భవనాన్ని కట్టారు. ఈ భవనంలో అత్యాధునిక లైబ్రరీతో పాటు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్ తరహాలో ఆడిటోరియాన్నినిర్మించారు.