Ganta Srinivasa Rao : నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది మృతి: గంటా శ్రీనివాస రావు

Update: 2024-02-12 05:18 GMT

(Ganta Srinivasa Rao) ఏపీలో మద్యం పాలన సాగుతోందని, నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది మృతిచెందారని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్‌కు అవకాశం లేదని, అంతా క్యాష్‌మయంగా మారిపోయిందన్నారు. అసలు క్యాష్ మొత్తం ఎక్కడికి చేరుతోందని గంటా ప్రశ్నించారు. టీ స్టాల్ నుంచి కిళ్లీ కొట్టు వరకూ ప్రపంచం అంతా డిజిటల్‌గా మారిపోయిందని, కానీ జగన్ నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్‌కు అవకాశం లేదని ఫైర్ అయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదోళ్లను దోపిడీ చేస్తున్నారన్నారు. బ్రాండ్‌లన్నీ మార్చారని, గత ఐదేళ్లుగా జే అనే బ్రాండును మార్కెట్లోకి దింపారన్నారు. మద్యం నిషేధం అని చెప్పి ఆ మద్యాన్నే విచ్చలవిడిగా పంచుతున్నారన్నారు. హామీలకు విరుద్దంగా మద్యం ఆదాయాన్ని పొందుతున్నారని, నాసికరం మద్యం వల్ల 35 లక్షల మంది రోగాల బారిన పడినట్లు తెలిపారు.

మద్యం వల్లనే 30 వేల మంది ఏపీలో మరణించినట్లు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. పేదల ఆరోగ్యంతో చెలగాటం అడుతున్నారన్నారు. జగనన్న సురక్ష అని అంటూనే మళ్లీ ప్రజల వద్దకు వెళ్తున్నారని, అమ్మ ఒడి అంటూ ప్రభుత్వం వేసిన డబ్బులు నాన్న బుడ్డీకే సరిపోతుందని ఎద్దేవా చేశారు. కల్తీ మద్యానికి ఇష్టానుసారంగా రేట్లు పెంచారని, దానికి బుద్ది చెప్పడానికి పేదోడు సిద్ధంగా ఉన్నాడని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.




Tags:    

Similar News