తరాలు మారుతున్నా..వారి తలరాతలు మారటం లేదు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా..వారి ఇక్కట్లు తీరడం లేదు. ఆఖరికి చంద్రుడిపై కాలుమోపి అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నా అడవి బిడ్డల జీవితాల్లో మాత్రం ఆవగింజంత మార్పు కనిపించడం లేదు. కనీస మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక వర్షాలు కురిస్తే దిక్కుతోచని పరిస్థితి వైద్యం చేయించుకోవాలన్నా..మృతదేహానని తరలించాలన్నా వారు పడే నరకయాతన వర్ణనాతీతం. ఇలాంటి నరకాన్నే తాజాగా స్థానిక సర్పంచ్ ఎదురైంది. కన్న కొడుకు మృతదేహాన్ని తరలించేందకు ఆయన పడిన పాట్లు కంటతడి పెట్టించాయి.
అల్లూరి జిల్లా పెదబయలు మండలం జామి గూడకు చెందిన సర్పంచ్ అనెమ్మ కుమారుడు చంద్రకిరణ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ఎంత వైద్యం చేసినా అతడి ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో హటాత్తుగా అతను చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే చనిపోయాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని తమ గ్రామానికి తరలించేందుకు తండ్రి పడిన పాట్లు అందరి హృదయాలను కదిలించాయి. ప్రస్తుతం వర్షాల కారణంగా గుంజువాడ దగ్గర వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు దారి లేకపోవడంతో డోలీ కట్టుకుని ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు నుంచి మృతదేహాన్ని తరలించారు. ఈ దృశ్యం అందరిని కంటతడి పెట్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికైనా తమ కష్టాలు చూసి రహదారి నిర్మించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.