ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుప్రాంతాలలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గత కొంతకాలంగా రోడ్ల మరమ్మతు చేయకపోవడంతో గుంతలతో పూర్తిగా పాడయ్యాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజలు అధ్వాన రహదారులతో నిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు. వీధులు సరే ప్రధాన మార్గలు సైతం గుంతలు నిండిన రోడ్లపై ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పలితం లేకుండా పోయిందని అంటున్నారు. ఈ క్రమంలో తమ బాధలు అందరికీ తెలిసేలా ఓ యవకుడు చేసిన వినూత్న నిరసన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏలూరు టౌన్ నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిల్‌హౌస్‌పేట వద్ద ఆ యువకుడు నవారు మంచాన్ని రోడ్డుపై వేసుకుని పడుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆర్టీసీ బస్సు యువకుడు నిరసన తెలియజేస్తున్న మార్గం వైపు వచ్చింది. అయినా యువకుడు మంచం తీయకుండా అలాగే పడుకున్నాడు. బస్సు డ్రైవర్, స్థానికులు యువకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు గంటసేపు తర్వాత యువకుడు మంచం తీసివేయడంతో బస్సు ముందుకు కదిలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో రోడ్డుపై భారీ గుంత ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో అందులో వర్షపునీరు నిలిచి ఉన్నాయి. ఆ మట్టి నీళ్లల్లోనే యువకుడు మంచం వేసుకుని పడుకున్నాడు.
రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉండటం వల్ల ఈ గతుకుల రోడ్డులో ప్రయాణించడం చాలా కష్టంగా ఉందని యువకుడు చెబుతున్నాడు. అనేకసార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు మొర పెట్టుకున్నామని, అయినా పట్టించుకోలేదని తెలిపాడు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇలా నిరసన చేపట్టాల్సి వచ్చిందని చెప్పాడు. ఇప్పటికైనా రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. మరి అధికారులు స్పందిస్తారో.. లేదో చూడాలి.