Chandrababu Petition :నేడు చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లు ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణకు రానున్నాయి. (Chandrababu Petition) ఈ రెండు పిటిషన్లపై బుధవారం విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామని ఏసీబీ కోర్టు మంగళవారం ప్రకటించింది. గతంలో ఇచ్చిన 2 రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరఫు లాయర్లు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ న్యాయమూర్తి చంద్రబాబు కస్టడీపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మరోవైపు చంద్రబాబు ఏ1 నిందితుడిగా ఉన్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసును ఇవాళ్టికి వాయిదా వేసిన న్యాయమూర్తి మధ్యాహ్నం 2.15గంటలకు వాదనలు వింటామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి 18వ రోజులు అయింది. స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు నంద్యాలలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం జైలులోని స్నేహా బ్లాక్ లో ఉన్నారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 5 వరకు చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్లో ఉండనున్నారు.