పేర్ని నాని, గోరంట్ల బుచ్చయ్య మధ్య ఆసక్తికర సంభాషణ

Update: 2024-02-06 10:33 GMT

ఏపీ అసెంబ్లీ లాబీలో పేర్ని నాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య నవ్వులు పూయించే సంభాషణ జరిగింది. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీ బ్రేక్ కోసం కొంతసేపు వాయిదా వేశారు. ఆ సమయంలోనే టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుపడ్డారు.

పేర్ని నాని బుచ్చయ్యను చూడగానే.. త్వరలోనే మీరూ నేను రిటైర్ అవుతున్నాం కదా అంటూ పలకరించారు. ఈ మాటలకు బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ..తాను రిటైర్ కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదని అంటున్నారు కదా అని పేర్ని నాని అనడంతో బుచ్చయ్య చౌదరి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీలో ఉంటానని బుచ్చయ్య తేల్చి చెప్పారు. వారి సంభాషణ అక్కడున్నవారిని నవ్వులు పూయించింది.

వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ఈ ఆసక్తికర సంభాషణతో అక్కడున్నవారు కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. ఈసారి ఎన్నికల్లో మచిలీపట్టణం నుంచి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీ చేస్తున్నారు. మరోవైపు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగనుండగా టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీలో దిగుతున్నాయి.

Tags:    

Similar News