సినిమాలకు చాలా ఏళ్ల కిందటే దూరమైన ‘ఆనంద్’ ఫేమ్ నటుడు రాజా అబెల్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన బుధవారం విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో మువ్వన్నెల కండువా కప్పుకున్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశానికి ఎన్నో సేవలు చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనకు సంతోషంగా ఉందని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన కాంగ్రెస్ దేశానికి దారి చూపుతుందని అన్నారు. ‘‘మణిపుర్ హత్యాకాండపై చాలా మంది నోరు మెదపలేదు. మీడియానే కాదు. రాజకీయ పార్టీలు కూడా ఈ సమస్యను విస్మరించాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిరసన తెలిపింది’’ అన్నారు.
ప్రస్తుతం క్రైస్తవ మతబోధకుడిగా బిజీగా ఉన్న రాజా 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీ ఓడిపోవడంతో రాజకీయాలకు దరమయ్యారు. ‘ఆనంద్’, ‘ఆ నలుగురు’ సినిమాలతో చిత్రాలో ప్రేక్షకాదరణ పొందిన రాజా సినీ గ్రాఫ్ తగ్గడంతో తెరమరుగయ్యారు. దివంగత సీఎ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో కాంగ్రెస్ చేరిన ఆయన తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు.