ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పబోయే ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇది లాంఛనంగా తీసుకున్న నిర్ణయం కాదని, దీన్నెలా అమలు చేస్తారో ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. ఆయన మంగళవారం పారిశ్రామిక అభివృద్ధి మండలి సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేసి, ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కలెక్టర్లు ప్రతి ఆరు నెలలకొకసారి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించారు. పరిశ్రమల కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న ప్రజలకు తమ ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందన్నారు. ఏపీలో మానవ వనరులకు కొరత లేదని, పరిశ్రమల స్థాపనకు అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. కాగా మంగళవారం తెల్లారుజామున ప్రకాశం జిల్లాలో దర్శిలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.