ట్రాక్టర్‌ నడిపిన సీఎం జగన్‌..ఫోటోలు వైరల్

Update: 2023-06-02 07:54 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన యంత్ర సేవా పథకం కార్యక్రమంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరికొత్తగా కనిపించారు. ఓ రైతు గ్రూపుతో కలిసి సీఎం జగన్‌ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. కార్యక్రమానికి వచ్చిన రైతులను ఉత్సాహపరిచారు.




సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని చుట్టగుంట వద్ద 'వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం' మెగా మేళా ప్రారంభమైంది. ఈ మేళాకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాజరయ్యారు. యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు సీఎం. ట్రాక్టర్లు, కోత యంత్రాలను సీఎం జగన్ అర్హులకు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ కోత యంత్రాలను పంపిణీ చేశారు. అదే విధంగా 5,262 రైతు గ్రూపు బ్యాంక్‌ అకౌంట్లలో రూ.175.61 కోట్ల సబ్సిడీని జమ చేశారు. అనంతరం రైతులతో ముచ్చటించిన సీఎం స్వయంగా ట్రాక్టర్ నడిపి అక్కడికి వచ్చిన రైతులను ఉత్సాహపరిచారు.



ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.." వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం రైతులకు అండగా ఉంటుంది. యంత్ర పరికరాలను అతి తక్కువ ధరలకే రైతు వేదికల ద్వారా కర్షకులకు అందిస్తున్నాం. ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు ఆర్బీకేలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. రూ. 361.29 కోట్ల విలువైన ట్రాక్టర్లు, కోత యంత్రాలను రైతు గ్రూపులకు కొత్తగా అందించాం. ప్రతీ సెంటర్‌లో కేవలం యంత్రాల కోసమే ప్రత్యేకంగా రూ.15లక్షలు కేటాయించాం .ఆర్బీకే సెంటర్ల ద్వారానే వారికి కావాల్సిన పరికరాలను అందిస్తాం. ఈ సందర్భంగానే వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రానున్న అక్టోబర్‌ నాటికి 7లక్షల మందికి లబ్ధి చేకూరేలా యంత్రాలను అందజేస్తాం. రైతులందరికీ మంచి జరగాలన్నదే ఏపీ సర్కార్ లక్ష్యం"అని జగన్ తెలిపారు. 




 


Tags:    

Similar News