దేవరగట్టు కర్రల సమరంలో విషాదం.. ఒకరు మృతి, మరో ముగ్గురు..

Byline :  Veerendra Prasad
Update: 2023-10-25 02:28 GMT

కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల సమరం మరోమారు రక్తాన్ని చిందించింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా.. తమ సంప్రదాయం అంటూ యథావిధిగా ఈ జగడం కొనసాగించారు. ఈ నేపథ్యంలో దేవరగట్టులో మరోసారి సంప్రదాయమే గెలిచింది. ఈ సమరంలో 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కర్రల సమరాన్ని చూసేందుకు వచ్చిన కొందరు స్థానికులు సమీపంలోని చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగిపడి గణేశ్‌ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ దేవరగట్టు కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చేసిన ఫలితాలు సక్సెస్ కాలేదు. కర్రల సమరం వద్దని కొన్ని రోజులుగా అవగాహన సదస్సులు నిర్వహించినా.. ఎవరూ పట్టించుకోలేదు. నిన్న అర్ధరాత్రి గట్టుకు చేరుకున్న భక్తులు తమ వెంట పెద్దఎత్తున కర్రలు తెచ్చారు. ఒకరిపై ఒకరు కనికరం లేకుండా తలలు పగులగొట్టుకున్నారు. రక్తాలు చిందుతున్నా.. నేటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పోలీసులు, అధికారులు ఈ సమరంలో పరిస్థితిని దగ్గురుండి మరీ సమీక్ష చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్నూలు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ నేతృత్వంలో వెయ్యి మంది పోలీస్‌ బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు భక్తిభావంతో ఆరాధిస్తారు. ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలను సొంతం చేసుకోవడానికి తెల్లారేవరకు కర్రల సమరం జరుగుతుంది. మాల మల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు మూడు గ్రామాలు ఓ వైపు, ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి ఆరు గ్రామాలు మరోవైపు ఉండి కొట్టుకుంటారు. ఉత్సవ విగ్రహాన్ని దక్కించుకోవడానికి ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకుంటారు. ప్రాణాలు పోతున్నా, శరీరాలు రక్తమోడుతున్నా లెక్క చేయరు.




Tags:    

Similar News