ఏపీలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన మద్యం దుకాణాల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నరసాపురంలోని ఓ వైన్స్ షాపులోకి వెళ్లిన బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అక్కడి అమ్మకాలపై ఆరా తీశారు. ఒక రోజులో లక్ష సరుకు అమ్మితే కేవలం 700కు మాత్రమే బిల్లు ఇచ్చారని ఆమె ఆరోపించారు. మద్యంతో వైసీపీ నాయకులు డబ్బులు దండుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఈక్రమంలో మద్యం సీసాలను ధ్వంసం చేశారు.
వైసీపీ అవినీతికి ఈ మద్యం దుకాణమే నిదర్శనమని పురందేశ్వరి విమర్శించారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో వైసీపీ ఆటలాడుతోందని మండిపడ్డారు. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. మద్యం బాండ్లను తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చిందని ఆరోపించారు. అనంతరం మద్యానికి బానిసై అనారోగ్యంతో నరసాపురం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని ఆమె పరామార్శించారు.