Aadudam Andhra: ఆడుదాం ఆంధ్రా.. బ్యాటింగ్ చేసిన సీఎం జగన్
గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో ఆడుదాం ఆంధ్రా(Adudam Andhra) పోటీలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ 2023లో క్రీడలకు సంబంధించి సీఎం జగన్, క్రీడాకారులతో ప్రమాణం చేయించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలకు స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ చాలా అవసరమని సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కిట్లను అందజేసిన జగన్ ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అని అన్నారు. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండగ.. 47 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు.
ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని సీఎం జగన్ అన్నారు. క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, మంచి ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే లక్ష్యమన్న ఆయన.. గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని చెప్పారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరికి ప్రతి ఒక్కరికీ పండుగే అని అన్నారు. గ్రామగ్రామాలలో ఆరోగ్య అవగాహన కోసం క్రీడలు ప్రాముఖ్యాన్ని తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నామని జగన్ ప్రకటించారు.
అనంతరం ఆడుదాం ఆంధ్రలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కిట్స్‌ను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రోజా, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజినీతోపాటు జిల్లా అధికారులు ఇతర వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అక్కడ సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా, సీఎం బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు. అనంతరం మంత్రి రోజాకు ముఖ్యమంత్రి బ్యాటింగ్ మెళకువలు నేర్పారు.