చంద్రబాబుకు మరో ఉచ్చు బిగించిన జగన్.. పైబర్ నెట్ స్కాంలో సీఐడీ వారంట్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై మరిన్ని కేసులు పెట్టి జైల్లో ఉంచాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయనకు మరో ఉచ్చు బిగుసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఫైబర్ నెట్ కుంభకోణంలో బాబును విచారించడానికి అనుమతి కోరుతూ సీఐడీ అధికారులు మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారంట్ దాఖలు చేశారు. 2021లో నమోదైన కేసులో నిజానిజాలు తేల్చడానికి బాబును విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ కుంభకోణంలో 19 మందిపై కేసులు పెట్టామని, చంద్రబాబు ప్రధాన నిందితుడన్న సీఐడీ.. రూ. 121 కోట్ల అవినీతి జరిగిందని వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కాంట్రాక్టును టెర్రా సాప్ట్ కంపెనీ అడ్డగోలుగా కట్టబెట్టారని ఆరోపించింది. కోర్టు సీఐడీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన బాబుపై సీఐడీ.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంపై పీటీ వారంట్ కోరిన సంగతి తెలిసిందే. ఇలాంటి మరిన్ని కేసుల్లో బాబును ఇరికించి జైలు లోపలే ఉంచాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
తీర్పు రిజర్వులో
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. మధ్యాహ్నం 12గంటల నుంచి 5 గంటల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ, 409కి వచ్చే అక్రమాలు జరిగాయంటున్న ప్రభుత్వం ఆధారాలు చూపడం లేని బాబు న్యాయవాదులు వాదించారు. ఇప్పటికే స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు నడుస్తున్నాయని, పథకం కింద కొన్న పరికరాలు కూడా ఉన్నాయని వివరించారు.